‘మధ్య’భారత పోరాటం

కేంద్రంలో అధికారం సాధించడానికి అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ ఒకటి. గత రెండు ఎన్నికల్లో దాదాపుగా క్లీన్‌స్వీప్‌ చేసిన భాజపా.. ఈసారీ సగర్వంగా సర్వం సాధించాలని చూస్తోంది.

Updated : 15 Apr 2024 06:10 IST

సగర్వంగా సర్వం సాధించాలని భాజపా
గౌరవం దక్కించుకోవాలని కాంగ్రెస్‌

కేంద్రంలో అధికారం సాధించడానికి అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ ఒకటి. గత రెండు ఎన్నికల్లో దాదాపుగా క్లీన్‌స్వీప్‌ చేసిన భాజపా.. ఈసారీ సగర్వంగా సర్వం సాధించాలని చూస్తోంది. మరోవైపు గౌరవప్రదమైన సీట్లు సాధించి పరువు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ పోరాడుతోంది. రాష్ట్రంలోని 29 స్థానాలకు నాలుగు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. ఈ నెల  19, 26, మే 7, 13 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. జాతీయ రాజకీయాల్లో ఈ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యముంటుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌ తర్వాత ఈ రాష్ట్రంలో అధిక సీట్లు సాధిస్తే అధికారం దక్కుతుందని భావిస్తారు.


తిరుగులేని భాజపా

గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో భాజపా తిరుగులేని విజయాలను సాధించింది. 2014లో 27 సీట్లను గెలుచుకుంది. 2019లో 28 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్‌కు ఒక్క సీటే దక్కింది. అదీ కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ గెలుచుకుందే.

  • 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 స్థానాల్లో 163 గెలుచుకుని భాజపా చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్‌ 66 స్థానాలకే పరిమితమైంది.
  • 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 61.2 శాతం ఓట్లను సాధించింది.
  • కాంగ్రెస్‌ 35.8 శాతం ఓట్లనే సాధించగలిగింది.
  • ఈసారి భాజపా 29 సీట్లలో పోటీ చేస్తోంది.
  • భాజపా మోదీ ప్రభను, రామ మందిరం అంశాలను నమ్ముకుంది.

కాంగ్రెస్‌కూ గట్టి పట్టే

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కూ గట్టి పట్టే ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్‌ను చీల్చి భాజపా అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 2019 ఎన్నికల నాటికి ఒక లోక్‌సభ సీటుకే కాంగ్రెస్‌ పరిమితమైంది.

  • గత రెండు లోక్‌సభ, గతేడాది అసెంబ్లీ  ఎన్నికల్లో పరాజయం చవిచూసిన కాంగ్రెస్‌.. ఈసారి గౌరవప్రదమైన సీట్లు సాధించడం కత్తిమీద సామే. జ్యోతిరాదిత్య సింధియా లాంటి సీనియర్లు పార్టీని వీడి వెళ్లడం దెబ్బే.
  • ఈసారి కాంగ్రెస్‌ 28 సీట్లలో పోటీ చేస్తోంది. ఒక సీటును భాగస్వామి సమాజ్‌వాదీ పార్టీకి కేటాయించింది. కాంగ్రెస్‌ పార్టీ కుల గణన, రిజర్వేషన్ల పెంపు వంటి వాటిని ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది.

మోదీ హవా

మధ్యప్రదేశ్‌లో మోదీ హవా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో కాంగ్రెస్‌ను గెలిపించిన ఓటర్లు జాతీయ స్థాయిలో మాత్రం మోదీకే మద్దతుగా నిలిచారు. 2014, 2019లలో మోదీ అసమాన విజయాలు సాధించారు. అందుకే గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కాదని, మోహన్‌ యాదవ్‌ లాంటి కొత్త నేతను సీఎంని చేశారు. తద్వారా రాష్ట్రంలో మోదీ ప్రభావమే అధికంగా ఉందనే అభిప్రాయం కలిగించే ప్రయత్నాన్ని భాజపా అధిష్ఠానం చేసింది. ఇక రామ మందిరం అంశం ఎలాగూ ఉంది.


తొలి విడతలో..

మధ్యప్రదేశ్‌లో తొలి విడతలో 6 స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. ఈ విడతలో 88 మంది బరిలో ఉన్నారు. ఈ నెల 19వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

  • తొలి విడత ఎన్నికలు జరిగే వాటిలో సీధీ, శహడోల్‌, జబల్పుర్‌, మాండ్లా, బాలాఘాట్‌, ఛింద్వాడా ఉన్నాయి.
  • ఛింద్వాడా నుంచి మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కుమారుడు సిటింగ్‌ ఎంపీ నకుల్‌నాథ్‌ పోటీ చేస్తున్నారు. ఆయనతో భాజపా నుంచి వివేక్‌ బంటీ సాహు తలపడుతున్నారు.
  • కేంద్ర మంత్రి ఫగన్‌సింగ్‌ కులస్థే మాండ్లా నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్‌.. ఓంకార్‌ సింగ్‌ మార్కంను నిలిపింది.
  • జబల్పుర్‌లో భాజపా నుంచి ఆశిష్‌ దూబే, కాంగ్రెస్‌ నుంచి దినేశ్‌ యాదవ్‌ తలపడుతున్నారు.
  • సీధీలో భాజపా తరఫున రాజేశ్‌ మిశ్ర, కాంగ్రెస్‌ తరఫున కమలేశ్వర్‌ పటేల్‌ పోటీ చేస్తున్నారు.
  • శహడోల్‌లో భాజపా నుంచి హిమాద్రి సింగ్‌, కాంగ్రెస్‌ నుంచి ఫుండేలాల్‌ మార్కో పోటీ చేస్తున్నారు.
  • బాలాఘాట్‌లో భాజపా తరఫున భారతీ పార్దీ, కాంగ్రెస్‌ తరఫున సామ్రాట్‌ సింగ్‌ పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్‌ ఆశ

ఉత్తర భారతంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. ముఖ్యంగా సైన్యంలో తాత్కాలిక నియామకాలపట్ల అక్కడి యువత అసహనంగా ఉంది. ఇది తనకు కలిసివచ్చే అవకాశముందని కాంగ్రెస్‌ భావిస్తోంది.

  • ధరల పెరుగుదల అంశమూ ప్రజలను ఇబ్బంది పెడుతోంది.
  • కాంగ్రెస్‌ సీనియర్లు కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌లాంటి నేతల ప్రాభవం ఏమన్నా మేలు చేస్తుందేమోనని ఆశిస్తోంది. దీనివల్ల కొన్ని సీట్లయినా గెలుచుకోవాలని తలపోస్తోంది.

మొత్తం సీట్లు: 29
రిజర్వుడు సీట్లు: 10
జనరల్‌: 19


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని