Kishan Reddy : ప్రగతి భవన్‌లోనా..? ఫామ్‌హౌస్‌లోనా..? కేసీఆర్‌తో చర్చకు నేను రెడీ : కిషన్‌రెడ్డి

దేశాన్ని అవమానించే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Updated : 13 Feb 2023 14:25 IST

దిల్లీ : దేశాన్ని అవమానించే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (kishan reddy) మండిపడ్డారు. కేంద్రాన్ని విమర్శించేందుకే అసెంబ్లీ సమావేశాలను వాడుకున్నారని.. బడ్జెట్‌పై కేసీఆర్‌ ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదని విమర్శించారు. దిల్లీలో కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎంపై నిప్పులు చెరిగారు.

‘‘కేంద్రంపై కేసీఆర్‌ బురద జల్లుతున్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో కేసీఆర్‌ కాంగ్రెస్‌ను పొగిడారు.. భాజపాని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. నిన్నటి వరకూ కమ్యూనిస్టులను తిట్టిన ఆయన.. ఇప్పుడు వారితో కలిసి నడుస్తున్నారు. ఇక దేశ పరిస్థితులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? రెండు పడక గదుల హామీ, నిరుద్యోగ భృతిపై ఎందుకు చర్చ జరపలేదు? ఎస్సీలకు మూడెకరాల భూమి ఏమైంది? భారాస పెట్టుకున్నా ఉపయోగం లేదని కేసీఆర్‌కు అర్థమైంది. తిరుమలరాయుని పిట్టకథ దేశంలో ఒక్క కేసీఆర్‌కు మాత్రమే వర్తిస్తుంది’’

‘‘కేసీఆర్‌ రాజీనామా చేస్తానని గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ఇంకో ఆరేడు నెలలు ఆగితే ఆయన రాజీనామా చేసే పరిస్థితి తప్పకుండా వస్తుంది. కేసీఆర్‌ చెప్పిన లెక్కలపై చర్చకు నేను సిద్ధం. చర్చకు ఎక్కడికి రమ్మంటారో కేసీఆరే చెప్పాలి. చర్చ కోసం ప్రెస్‌క్లబ్‌కు వస్తారా? అమరవీరుల స్థూపం వద్దకు వస్తారా?ప్రగతి భవన్‌లోనా.. ఫామ్‌హౌస్‌లోనా.. కేసీఆర్‌తో చర్చకు ఎక్కడైనా నేను సిద్ధం’’

‘‘దేశ ఆర్థిక పరిస్థితిపై ఐఎంఎఫ్‌ ఏం చెప్పిందో కేసీఆర్‌ గూగుల్‌లో చూసి తెలుసుకోవాలి. రాష్ట్ర అప్పులను కేసీఆర్‌ ఐదు లక్షల కోట్లకు చేర్చారు. 2014లో రాష్ట్ర అప్పు రూ.60 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు 5 లక్షల కోట్లకు చేరింది. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీ చేశారు. కల్వకుంట్ల కుటుంబ మంత్రులు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారు.  దేశాన్ని అవమానించే విధంగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. అమెరికా అప్పు జీడీపీలో 120 శాతం. యూకే అప్పు జీడీపీలో 273 శాతం. అయితే.. ఇండియా అప్పు జీడీపీలో 19.9 శాతం మాత్రమే. హైదరాబాద్‌ తలసరి ఆదాయం ఎంత? కుమురం భీం జిల్లా తలసరి ఆదాయం ఎంత?’’ అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని