Mamata Banerjee: ప్రధానితో భేటీ అవుతా.. నిధులపై ప్రశ్నిస్తా: మమతా బెనర్జీ

త్వరలోనే ప్రధాని మోదీతో భేటీ అవుతానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆయన్ను ప్రశ్నిస్తానని చెప్పారు.

Published : 10 Dec 2023 02:23 IST

కోల్‌కతా: ప్రధాని మోదీతో (PM Modi) త్వరలోనే భేటీ అవుతానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయని, వాటిని విడుదల చేయడంలో కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తోందని ఆయన్ను ప్రశ్నిస్తానని చెప్పారు. ఎంత వేచి చూసినా ఫలితం ఉండటం లేదని, అందుకే కొందరు ఎంపీలతో కలిసి దిల్లీ వెళ్లి.. నేరుగా ప్రధానితో చర్చిస్తానని తెలిపారు. గత వారం రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న మమతా బెనర్జీ.. సిలిగుడి సమీపంలోని బాగ్‌డోగరా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. 

ఈ నెల 18 నుంచి 20వ తేదీలో లోపు ఏదో ఒక రోజు దిల్లీ వెళ్తానని, ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కూడా కోరానని మమతా బెనర్జీ మీడియాకు తెలిపారు. జీఎస్టీ వసూలు చేస్తున్న కేంద్రం.. రాష్ట్రానికి రావాల్సిన వాటాను విడుదల చేసేందుకు మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందని ఆమె విమర్శించారు. ఉపాధి హామీకి సంబంధించిన MGNREGA నిధులు రూ. కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయని, ఇవే కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక బకాయిలు చాలా ఉన్నాయని చెప్పారు. కేంద్రం నిధులను ఆపేసినా, రాష్ట్ర వనరులను ఉపయోగించి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌  ‘ఇండియా’ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని