Harish Rao: మోసం.. దగాకు మారుపేరు కాంగ్రెస్‌ పార్టీ: మంత్రి హరీశ్‌రావు

మోసం.. దగాకు మారు పేరు కాంగ్రెస్‌ అని, ఆ పార్టీని నమ్మి ఓటేస్తే ఆగం అవుతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Updated : 28 Oct 2023 15:22 IST

ఉట్నూర్‌: మోసం.. దగాకు మారు పేరు కాంగ్రెస్‌ అని, ఆ పార్టీని నమ్మి ఓటేస్తే ఆగం అవుతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అధికారంలోకి వస్తే గిరిజన తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా మారుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మోసం చేస్తే.. వాటిని నెరవేర్చింది మాత్రం కేసీఆర్‌ ప్రభుత్వమని గుర్తు చేశారు. కేసీఆర్‌ అంటేనే ఒక నమ్మకం అని పేర్కొన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఏజెన్సీలోని గిరిజన రైతులను ఆదుకున్నామన్నారు. రైతు బీమా మాదిరిగానే.. భూమిలేని పేదలకు రూ.5లక్షల బీమా వర్తింప చేస్తామన్నారు.

రైతులకు 3గంటల విద్యుత్‌ సరిపోతుందని రేవంత్‌రెడ్డి అంటున్నారన్నారు. 3గంటల కరెంట్‌ కావాల్సిన వాళ్లు కాంగ్రెస్‌కు.. 24 గంటల ఉచిత కరెంటు కావాలనుకునే వాళ్లు భారాసకు ఓటువేయాలని కోరారు. కాంగ్రెస్‌ పాలించే కర్ణాటకలో, భాజపా పాలించే మహారాష్ట్రలో రైతులకు 24గంటల కరెంటు ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్‌ హయాంలో ఆదిలాబాద్‌ అభివృద్ధి ఖిల్లాగా మారిందన్నారు. భారాస మేనిఫెస్టోను గడప గడపకూ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పదేళ్ల నుంచి రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని.. ఈ పదేళ్లలో కరవు లేదు.. కర్ఫ్యూ లేదన్నారు. గతంలో ప్రభుత్వాలు రైతుల నుంచి డబ్బులు వసూలు చేసేవని, ఇప్పుడు కరెంటు బిల్లు లేదు, నీటి తీరువా బిల్లు చెల్లించాల్సిన పనిలేదని చెప్పారు.

ఈ దేశంలో రైతులకు డబ్బులిచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. మళ్లీ భారాస గెలిస్తే ఎకరాకు రూ.16వేలు చొప్పున రైతు బంధు ఇస్తామన్నారు. ఏటా 10వేల మంది వైద్యులను దేశానికి తెలంగాణ అందిస్తోందని, ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌రావు వివరించారు. మళ్లీ భారాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. డిసెంబరు 30న కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని