BJP: 370 స్థానాల్లో భాజపా విజయం.. ఆర్టికల్‌ 370 రద్దుకు సరైన గౌరవం: పీయూష్‌ గోయల్‌

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను సాధించడం.. జమ్మూ-కశ్మీర్‌లో ‘ఆర్టికల్‌ 370’ రద్దుకు సరైన గౌరవం దక్కినట్లు అవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ తెలిపారు.

Published : 09 Mar 2024 16:55 IST

దిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం.. జమ్మూ-కశ్మీర్‌లో ‘ఆర్టికల్‌ 370’ రద్దుకు సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ (Piyush Goyal) పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం.. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir)ను ఏకీకృతం చేయడంలో సహాయపడిందని తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈమేరకు మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు, లోక్‌సభ ఎన్నికల్లో తన లక్ష్యానికి ముడిపెడుతూ భాజపా స్పందించడం ఇదే మొదటిసారి.

ఎన్డీయే కూటమిలో ఒడిశా అధికార పార్టీ ‘బీజేడీ’ చేరుతుందా? అనే దానిపై స్పందిస్తూ.. ఏయే పార్టీలు తమతో జట్టుకట్టనున్నాయో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయాణంలో భాగం కావాలనుకునే పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. భాజపా 370, ఎన్డీయే కూటమి 400కు పైగా సీట్లలో గెలుపును లక్ష్యంగా పెట్టుకోవడమనేది అతి విశ్వాసం, అహంకారం నుంచి వచ్చింది కాదని, పదేళ్ల తమ ప్రభుత్వ సుపరిపాలనపై ఉన్న ధీమా అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల ఫలితాలు ప్రపంచ దేశాలనూ ఆశ్చర్యానికి గురిచేస్తాయన్నారు.

కాంగ్రెస్‌కు మరో షాక్‌.. భాజపాలో చేరిన కేంద్ర మాజీ మంత్రి

ఇదిలాఉండగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా మొత్తం 303 సీట్లు సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం పలువురు ఎంపీల రాజీనామా తదితర కారణాలతో ఈ సంఖ్య 290కు తగ్గింది. ఈసారి 370కుపైగా స్థానాల్లో గెలుపొందాలనే టార్గెట్‌తో ప్రచారం ముమ్మరం చేసింది. లోక్‌సభ ఎన్నికల కోసం ఇటీవల 195 మందితో తొలి జాబితాను ప్రకటించిన కమలదళం.. మొత్తం 34 మంది కేంద్ర మంత్రులను బరిలోకి దించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని