
TS Politics : డీజీపీ నేతృత్వంలోనే భాజపా నేతలపై దాడులు : బండి సంజయ్
నల్గొండ : రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ దుయ్యబట్టారు. డీజీపీకి తెలిసే ఎంపీ అర్వింద్‌పై దాడి జరిగిందని అన్నారు. డీజీపీ నేతృత్వంలోనే భాజపా నేతలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీపై దాడి జరిగిన తర్వాత డీజీపీ మహేందర్‌రెడ్డికి, ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించడం లేదన్నారు. ఎంపీపైనే దాడి జరిగిందంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడుందని సంజయ్ ప్రశ్నించారు.ఎంపీ అర్వింద్‌పైన, పార్టీ నేతలపైన హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తన ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు.
నిజామాబాద్ జిల్లాలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై తెరాస శ్రేణులు రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. నందిపేట్ మండలం నూత్‌పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వెళ్తుండగా ఆర్మూర్ మండలం ఇస్సపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో అర్వింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో భాజపా, తెరాస శ్రేణులు ఘర్షణకు దిగాయి. ఇరువర్గాల ఘర్షణతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆర్మూర్‌లో భాజపా నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.