IND vs ENG: ఈసారి భారత్‌ విజేతగా నిలవాలి.. జడ్డూ నిబద్ధతగల క్రికెటర్: రివాబా

వన్డే ప్రపంచకప్‌లో వరుసగా విజయాలతో దూసుకుపోతున్న భారత్‌ తప్పకుండా విజేతగా నిలుస్తుందని భారత స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా వ్యాఖ్యానించారు.

Published : 28 Oct 2023 19:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వరల్డ్‌ కప్‌లో (ODI World Cup 2023) లఖ్‌నవూ వేదికగా ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు టీమ్‌ఇండియా (IND vs ENG) సమాయత్తమవుతోంది. ఇప్పటికే భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను ముమ్మరంగా చేసేస్తున్నారు. ఈ క్రమంలో భారత్ విజయం సాధించాలని కోరుతూ స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సతీమణి రివాబా ప్రత్యేకంగా స్పందించారు. టీమ్ఇండియా ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బందిపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. వరల్డ్‌ కప్‌ను భారత్‌ నెగ్గాలని ప్రార్థించినట్లు వెల్లడించారు.

‘‘భారత్‌ జట్టుకు, క్రికెట్ అభిమానులకు శుభాకాంక్షలు. టీమ్‌ఇండియా వరుసగా విజయాలు సాధిస్తూ ముందుకెళ్తోంది. ఈసారి తప్పకుండా విశ్వవిజేతగా నిలవాలని కోరుకుంటున్నా. గత 20 ఏళ్ల రికార్డును కివీస్‌పై బద్దలు కొట్టడం ఆనందంగా ఉంది. ఇదే క్రమంలో ఇంగ్లాండ్‌పైనా ఘన విజయం సాధించాలి. రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. అతడి అనుభవంతో జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. జట్టుపట్ల, కోచింగ్‌ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన ఆటగాడు’’ అని రివాబా వ్యాఖ్యానించారు. సీనియర్ ఆటగాడైన రవీంద్ర జడేజా బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫీల్డర్‌గానూ టీమ్‌ఇండియాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

వరల్డ్‌కప్‌లో భారత్‌ ఐదు విజయాలు సాధించి 10 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌పైనా గెలిస్తే దాదాపు సెమీస్‌ చేరుకోవడం ఖాయం. మరోవైపు ఇంగ్లాండ్‌ ఇప్పటికే సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు అనూహ్య ఫలితాలు ఎదురు కావడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని