SA vs IND: అవేశ్‌ ఖాన్‌కు పిలుపు.. సఫారీలతో రెండో టెస్టుకు జడేజా సిద్ధం!

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో (SA vs IND) ఘోర ఓటమి అనంతరం భారత జట్టులో మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. జట్టులోకి మరో పేసర్‌ను తీసుకుంటూ బీసీసీఐ కీలక ప్రకటన వెలువరించింది. 

Published : 29 Dec 2023 16:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డేలు, టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువ బౌలర్ అవేశ్‌ ఖాన్‌కు (Avesh Khan) టెస్టుల్లోకి పిలుపొచ్చింది. సీనియర్‌ పేసర్ మహమ్మద్ షమీ గాయం కారణంగా ఫిట్‌నెస్‌ సాధించని విషయం తెలిసిందే. షమీ స్థానంలో ఇప్పటిదాకా ఎవరినీ ఎంపిక చేయలేదు. కేప్‌ టౌన్‌ వేదికగా జరగనున్న రెండో టెస్టు కోసం షమీను రిప్లేస్ చేస్తూ మరో పేసర్‌కే అవకాశం కల్పించింది. ఈ మేరకు అవేశ్‌ ఎంపికపై బీసీసీఐ ప్రకటన వెలువరించింది. ‘‘సెలక్షన్‌ కమిటీ అవేశ్‌ ఖాన్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి జనవరి 7 వరకు జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడు’’ అని బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం అవేశ్‌ ఖాన్‌ దక్షిణాఫ్రికా పర్యటనలోనే ఉన్నాడు. సఫారీలతో వన్డే సిరీస్‌ ఆడాడు. విరామం లేని ఆట కారణంగా అలసిపోవడంతో యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం కాగా.. అతడి స్థానంలో కేఎస్ భరత్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే.

జడ్డూ సాధన షురూ..

వెన్ను నొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరమైన భారత స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండో టెస్టులో ఆడేందుకు ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. తొలి టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా భారత ఆటగాళ్లతో కలిసి రవీంద్ర జడేజా మైదానంలో కలియదిరిగాడు. ప్రాక్టీస్‌ సందర్భంగానూ ఎలాంటి ఇబ్బంది పడటం లేదని క్రికెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. జట్టు కండీషనింగ్‌ కోచ్ రజనీకాంత్‌ పర్యవేక్షణంలో దాదాపు 20 నిమిషాల పాటు ముకేశ్‌ కుమార్‌తో కలిసి బౌలింగ్‌ కూడా చేశాడు. షార్ట్‌ సెషన్‌లో ఎక్కడా ఇబ్బంది గురైనట్లు అనిపించడకపోవడంతో భారత శిబిరానికి ఊరటనిచ్చే అంశమే. రెండో టెస్టులో జడేజా ఆడితే.. బ్యాటర్‌గానూ రెండో స్పిన్నర్‌గానూ జట్టుకు ఉపయోగపడతాడు. ఒకవేళ అవేశ్‌ ఖాన్‌, రవీంద్ర జడేజా తుది జట్టులోకి వస్తే ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని