ఆ సంబరాలు ఆమె కోసమే

అంతర్జాతీయ కెరీర్‌ను గొప్పగా ఆరంభించిన హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌వర్మ.. విండీస్‌తో రెండో టీ20లో తొలి అర్ధశతకం అందుకున్నాడు.

Published : 08 Aug 2023 02:52 IST

ప్రావిడెన్స్‌ (గయానా): అంతర్జాతీయ కెరీర్‌ను గొప్పగా ఆరంభించిన హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌వర్మ.. విండీస్‌తో రెండో టీ20లో తొలి అర్ధశతకం అందుకున్నాడు. ఈ మైలురాయి చేరుకున్న తర్వాత.. రెండు చేతులూ ఆడిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ సంబరాలు సమైరా (రోహిత్‌ శర్మ తనయ)కు అంకితమని మ్యాచ్‌ తర్వాత తిలక్‌ వెల్లడించాడు. ‘‘ఆ సంబరాలు రోహిత్‌ తనయ సమ్మీ (సమైరా) కోసమే. ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు సెంచరీ లేదా అర్ధసెంచరీ సాధించినా ఆమె కోసమే సంబరాలు చేసుకుంటానని తనకు మాటిచ్చా’’ అని అతను చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌ను ఇంత గొప్పగా ప్రారంభించడం వెనుక రోహిత్‌ శర్మది కీలక పాత్ర అని తిలక్‌ పేర్కొన్నాడు. ‘‘రోహిత్‌ భాయ్‌ నాకెప్పుడూ మద్దతుగా నిలుస్తాడు. ఆటను ఆస్వాదించమంటాడు. ఎలా ఆడాలో చెబుతాడు. చిన్నప్పటి నుంచి రైనా, రోహిత్‌ నాకు స్ఫూర్తి. రోహిత్‌తో చాలా సమయం గడుపుతా. నా మొదటి ఐపీఎల్‌ సీజన్‌ అప్పుడు ‘తిలక్‌ అన్ని ఫార్మాట్ల ఆటగాడు’ అని రోహిత్‌ చెప్పడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అంతర్జాతీయ క్రికెట్‌ అంత సులభం కాదు. మనుగడ సాగించాలంటే నిలకడగా రాణించాల్సిందే. మైదానం బయట, లోపల క్రమశిక్షణతో ఉండాలి. పని తీరులోనూ క్రమశిక్షణ అవసరం. నిరంతర ప్రక్రియగా ఇదంతా చేస్తూంటే మంచి ఫలితాలు వస్తాయి. నేనాడిన ఐపీఎల్‌ రెండు సీజన్లే నా కెరీర్‌లో మలుపు. ఆ ప్రదర్శనతోనే టీమ్‌ఇండియా నుంచి పిలుపొచ్చింది. అదే ప్రదర్శనను కొనసాగిస్తున్నా. అండర్‌-19 ప్రపంచకప్‌ నుంచి కోచ్‌ ద్రవిడ్‌ సర్‌తో మాట్లాడుతూనే ఉన్నా. ప్రాథమిక అంశాలను అనుసరిస్తూ, క్రీజులో ఎక్కువ సమయం గడపాలని ద్రవిడ్‌ చెబుతుంటాడు’’ అని అతను తెలిపాడు. విండీస్‌తో రెండో టీ20లో తిలక్‌ 51 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కానీ జట్టు 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది.   ‘‘ఆ పిచ్‌ మందకొడిగా ఉంది. రెండు రకాలుగా స్పందించింది. 150-160 మంచి స్కోరే అనుకున్నాం. కానీ తర్వాత ఓ 10 పరుగులు తక్కువ చేశామనిపించింది. ఉత్తమంగా బ్యాటింగ్‌ చేసిన పూరన్‌కు ఘనత దక్కాలి. ఒక్క వికెట్‌ దక్కితే చాలు గెలుస్తామనిపించింది. ఎందుకంటే పిచ్‌ అంత మందకొడిగా ఉంది. వెస్టిండీస్‌ మెరుగ్గా బౌలింగ్‌ చేసింది. గాలి పరిస్థితి, పిచ్‌ను చక్కగా ఉపయోగించుకుని ఆ బౌలర్లు బంతులేశారు’’ అని తిలక్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని