Stock market: సెన్సెక్స్‌, నిఫ్టీ ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. సూచీల లాభాల పరుగుకు కారణాలు ఇవే..!

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ కొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి.

Updated : 23 May 2024 16:20 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. ఆర్‌బీఐ డివిడెండ్‌, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదుచేశాయి. సెన్సెక్స్‌ దాదాపు 1200 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,900 ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 74,253.53 పాయింట్ల (క్రితం ముగింపు 74,221.06) వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. తర్వాత లాభాల జోరు మొదలైంది. ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్‌ 75,499.91 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠాలను అందుకుంది. చివరికి 1196.98 పాయింట్ల లాభంతో 75,418.04 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 369.85 పాయింట్ల లాభంతో 22,967.65 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 22,993.60 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ షేర్లు మినహా అన్ని షేర్లూ లాభపడ్డాయి.

కారణాలు ఇవే..

  • ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ అంచనాలను మించి ఆర్‌బీఐ తాజాగా కేంద్రానికి డివిడెండ్‌ ప్రకటించడం సూచీల పరుగుకు కారణమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.2.11 లక్షల కోట్లను ఆర్‌బీఐ ప్రభుత్వానికి అందించనుంది. ఈ మొత్తం కేంద్రం తన ద్రవ్యలోటు పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది. ఆర్‌బీఐ నుంచి రూ.లక్ష కోట్లు వస్తాయని మార్కెట్‌ ముందుగా అంచనా వేసింది. అంతకు డబుల్ డివిడెండ్‌ ఆర్‌బీఐ ప్రకటించడం గమనార్హం. మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మొత్తాన్ని కేంద్రం వినియోగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

  • ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. తొలినాళ్లలో పోలింగ్‌ తగ్గడం మదుపర్లలో ఆందోళన వ్యక్తమైంది. ఐదు దశల పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో మరోసారి స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడొచ్చన్న అంచనాలు బలపడడం మదుపరుల్లో ఉత్సాహం నింపింది. ఇదే ఆందోళనలతో విదేశీ సంస్థాగత మదుపర్లు సైతం అమ్మకాలకు దిగారు. తాజాగా దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లకు దిగడం సూచీల పరుగుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

    తాజాగా హెచ్‌ఎస్‌బీసీ వెలువరించిన డేటా కూడా సూచీలు రాణించడానికి మరో కారణం. దేశంలో ఎగుమతులు పెరిగాయని, మే నెలలో ఉద్యోగ కల్పన 18 ఏళ్ల గరిష్ఠానికి చేరడమూ మరో పాజిటివ్‌ అంశమని నిపుణులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని