David Warner: ఐపీఎల్‌లో నేర్చుకున్నా : డేవిడ్‌ వార్నర్‌

నేర్చుకునేందుకు ఐపీఎల్‌ ఓ మంచి వేదిక అని, ఇన్నింగ్స్‌ వేగాన్ని క్రమంగా పెంచే విషయంలో లీగ్‌ ఉపయోగపడిందని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వెల్లడించాడు.

Updated : 22 Oct 2023 08:58 IST

బెంగళూరు: నేర్చుకునేందుకు ఐపీఎల్‌ ఓ మంచి వేదిక అని, ఇన్నింగ్స్‌ వేగాన్ని క్రమంగా పెంచే విషయంలో లీగ్‌ ఉపయోగపడిందని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వెల్లడించాడు. పాకిస్థాన్‌పై 124 బంతుల్లో 163 పరుగులు ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ విజయంలో వార్నర్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ‘‘కెరీర్‌ ఆరంభంలో 50 ఓవర్లు అంటే సుదీర్ఘమైన మ్యాచ్‌గా భావించా. 35 ఓవర్ల వరకు ఆడేందుకు ప్రయత్నిస్తా. ఆ తర్వాత కూడా క్రీజులో ఉంటే మరింత దూకుడుగా ఆడతా. టీ20 క్రికెట్లోనే ఇలా గేర్లు మార్చడం నేర్చుకున్నా. ముఖ్యంగా ఐపీఎల్‌ ఎంతో ఉపయోగపడింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడేటప్పుడు చాలా నేర్చుకున్నా. మ్యాచ్‌లో మనం అనుకున్న దానికంటే చాలా సమయం ఎక్కువే ఉంటుంది. టెస్టు క్రికెట్‌ కూడా ఆడటం వల్ల సులువుగా గేర్లు మార్చవచ్చు. తొలి 10 ఓవర్లలో కొత్త బంతిని గౌరవించాలి. పరుగుల వేటలో సాగితే ఆ 10 ఓవర్లలోనే 50 పరుగులు చేయొచ్చు. అక్కడి నుంచి మన బలాన్ని చాటాలి. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకుంటే భారీ స్కోరు సాధించొచ్చు’’ అని వార్నర్‌ చెప్పాడు. పాకిస్థాన్‌పై వన్డేల్లో వరుసగా నాలుగో సెంచరీ చేసిన వార్నర్‌.. గణాంకాలను పెద్దగా పట్టించుకోనని తెలిపాడు. ‘‘కొన్ని జట్లపై మనకు మంచిగా కుదురుతుంది. కొన్ని సార్లు మంచి బంతులనూ షాట్లుగా ఆడొచ్చు. కానీ ఎప్పుడూ మనకు మనం మద్దతుగా నిలవాలి. ఈ గణాంకాలను పట్టించుకోను. పాక్‌పై వరుసగా నాలుగు సెంచరీలు చేసే వరకు కూడా ఇవి సాధిస్తానని అనుకోలేదు. బ్యాటింగ్‌లో మార్ష్‌, బౌలింగ్‌లో స్టాయినిస్‌ కూడా ఉత్తమంగా రాణించారు’’ అని వార్నర్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని