NZ vs PAK: దంచికొట్టిన రచిన్‌, కేన్ విలియమ్సన్‌.. పాకిస్థాన్‌ ముందు భారీ లక్ష్యం

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది.

Updated : 04 Nov 2023 14:48 IST

బెంగళూరు: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్థాన్‌ మధ్య కీలకపోరు జరుగుతోంది. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే పాక్‌ ఈ మ్యాచ్‌లో తప్పక నెగ్గాల్సి ఉంది. ఇంతటి కీలకమైన మ్యాచ్‌లో ఆ జట్టు బౌలర్లు విఫలమయ్యారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రపంచకప్‌లో కివీస్‌కిదే అత్యధిక స్కోరు. రచిన్‌ రవీంద్ర (108: 94 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్‌) మరోసారి సత్తాచాటాడు. ఈ వరల్డ్‌ కప్‌లో అతడికిది మూడో శతకం. మరోవైపు కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (95:79 బంతుల్లో, 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ఓపెనర్ డేవాన్ కాన్వే (35), మార్క్‌ చాప్‌మన్‌ (39), డారిల్ మిచెల్ (29) పరుగులు చేయగా.. చివర్లో గ్లెన్ ఫిలిప్స్‌ (41; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ శాంట్నర్‌ (26*; 17 బంతుల్లో 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. పాక్ బౌలర్లలో మహ్మద్‌ వసీమ్ 3, హసన్ అలీ, ఇప్తికార్ అహ్మద్‌, హారిస్‌ రవూఫ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.  

రచిన్, కేన్ భారీ భాగస్వామ్యం 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు కాన్వే, రచిన్ రవీంద్ర శుభారంభం అందించారు. నిలకడగా బౌండరీలు బాది స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. కాన్వే దూకుడుగా ఆడే క్రమంలో హసన్‌ అలీ వేసిన షార్ట్‌ బాల్‌కు వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో కివీస్‌ 68 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రచిన్‌తో కలిసి కేన్ దూకుడు కొనసాగించాడు. వికెట్ల కోసం పాక్‌ బౌలర్లు శతవిధాలా ప్రయత్నించినా ఏమాత్రం పట్టువిడవలేదు. దీంతో కేన్-రచిన్‌ రెండో వికెట్‌కు 180 పరుగులు నిర్మించారు. ఈ క్రమంలో రచిన్‌ సెంచరీ పూర్తి చేయగా.. కేన్‌ చేజార్చుకున్నాడు. ఇఫ్తికార్ అహ్మద్‌ బౌలింగ్‌లో (34.2వ ఓవర్) భారీ షాట్‌కు యత్నించి ఫకర్ జమాన్‌ చేతికి చిక్కాడు. స్వల్ప వ్యవధిలో రచిన్‌ కూడా పెవిలియన్‌కు చేరాడు. వాసిమ్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి బౌండరీ లైన్‌ వద్ద షౌద్‌ షకీల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని