కొత్త కెప్టెన్‌.. కోటి ఆశలతో

2013లో ఐపీఎల్‌ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్‌. స్టార్‌ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం.

Updated : 19 Mar 2024 07:15 IST

మరో 3 రోజుల్లో ఐపీఎల్‌-17
ఈనాడు క్రీడావిభాగం

2013లో ఐపీఎల్‌ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్‌. స్టార్‌ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. గత మూడు సీజన్లుగా అయితే మరింత పేలవ ప్రదర్శన.. ఇదీ మన జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రస్థానం. ఇప్పుడు కొత్త కెప్టెన్‌, కోచ్‌.. కోటి ఆశలతో మరో సీజన్‌కు సై అంటోంది. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా సారథిగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న కమిన్స్‌.. ఆరెంజ్‌ ఆర్మీ రాత మారుస్తాడా? జట్టుకు రెండో ట్రోఫీ అందిస్తాడా?

ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్‌    హైదరాబాద్‌ పేలవమైన ఆటతీరుతో, వివాదాలతో సాగుతోంది. సన్‌రైజర్స్‌కు ఆకర్షణ పెంచి, అభిమానులను అలరించిన వార్నర్‌ను వద్దనుకుని.. విలియమ్సన్‌ను కాదనుకుంది. దీంతో జట్టు ప్రతిష్ఠ కూడా మసకబారిందనే చెప్పాలి. వరుసగా సారథులను మారుస్తున్నా సరైన ఫలితాలు రాబట్టలేకపోయింది. 2021 నుంచి ప్రదర్శన మరింత దిగజారింది. ఆ ఏడాది చివరి స్థానంలో నిలిచింది. 2022లో 10 జట్ల పోరులో 8వ స్థానాన్ని దక్కించుకుంది. నిరుడు మళ్లీ ఆఖరి స్థానానికి పడిపోయింది. ఈ సారి విదేశీ ఆటగాళ్ల బలంతో, స్వదేశీ క్రికెటర్ల సత్తాతో 17వ సీజన్‌కు సిద్ధమైంది. నిరుడు ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా, వన్డే ప్రపంచకప్‌ విజేతగా నిలిపిన కమిన్స్‌ను వేలంలో ఏకంగా రూ.20.5 కోట్లకు సొంతం చేసుకుంది. అతనిపైనే ఆశలు పెట్టుకుని జట్టు పగ్గాలు అప్పగించింది. వార్నర్‌ సారథ్యంలో 2016లో కప్పును ముద్దాడిన సన్‌రైజర్స్‌ మరోసారి ఆస్ట్రేలియా ఆటగాడి సారథ్యంలో విజేతగా నిలుస్తుందేమో చూడాలి. కొత్త కోచ్‌ వెటోరితో కలిసి 8 ఏళ్ల ట్రోఫీ నిరీక్షణకు కమిన్స్‌ ముగింపు పలకాలన్నది తెలుగు రాష్ట్రాల అభిమానుల ఆశ.

బలాలు: నాణ్యమైన విదేశీ ఆటగాళ్లు సన్‌రైజర్స్‌కు కొండంత బలం. కెప్టెన్‌ కమిన్స్‌తో పాటు ట్రావిస్‌ హెడ్‌, మార్‌క్రమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, క్లాసెన్‌, యాన్సెన్‌, హసరంగ, ఫజల్‌ హక్‌ ఫరూఖీ లాంటి విదేశీ క్రికెటర్లు జట్టులో ఉన్నారు. పేస్‌ బౌలింగ్‌తో, బ్యాటింగ్‌తో సత్తాచాటే కమిన్స్‌ జట్టు కూర్పులో సమతూకం తెస్తాడు. ఇటీవల అతను సూపర్‌ ఫామ్‌లోనూ ఉన్నాడు. అతని నాయకత్వ నైపుణ్యాలపై ఎలాంటి సందేహాలు లేవు. హెడ్‌ ఎంతటి విధ్వంసక ఆటగాడో తెలిసిందే. ఈ ఏడాది టీ20ల్లో అతని స్ట్రైక్‌రేట్‌   152 పైనే. ఇక మార్‌క్రమ్‌, ఫిలిప్స్‌, క్లాసెన్‌ కూడా ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగలరు. పేసర్‌ యాన్సెన్‌, స్పిన్నర్‌ హసరంగ.. బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ అదరగొడతారు. జట్టులోని భారత బౌలర్ల దళం కూడా పటిష్ఠంగా ఉంది. పేస్‌ త్రయం భువనేశ్వర్‌, నటరాజన్‌, ఉమ్రాన్‌ నిలకడగా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. వాషింగ్టన్‌ సుందర్‌ నమ్మదగిన స్పిన్‌ ఆల్‌రౌండరే. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా సమతూకంగా కనిపిస్తోంది.

బలహీనతలు: భారత ఆటగాళ్ల అనుభవలేమి, ఫామ్‌ లేమి సన్‌రైజర్స్‌కు సమస్యగా మారుతోంది. అభిషేక్‌, రాహుల్‌ త్రిపాఠి, మయాంక్‌ అగర్వాల్‌, అబ్దుల్‌ సమద్‌, ఉమ్రాన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ అంచనాలను అందుకోవాల్సి ఉంది. అలాగే జట్టులో సమష్టితత్వం కూడా కొరవడుతోంది. వ్యక్తిగతంగా ఆటగాళ్లు రాణిస్తున్నా.. జట్టుగా విఫలమవుతున్నారు. ఆటగాళ్లనూ సరిగా ఉపయోగించుకోలేకపోవడం కూడా దెబ్బతీస్తుందనే చెప్పాలి. వార్నర్‌, విలియమ్సన్‌, మార్‌క్రమ్‌, ఇప్పుడేమో కమిన్స్‌.. ఇలా సారథులను వరుసగా మారుస్తుండటంతో జట్టు సంస్కృతి, ప్రధాన ఆటగాళ్ల బృందం అంటూ లేకుండా పోయింది. మరోవైపు అంచనాల ఒత్తిడిని కమిన్స్‌ ఎలా ఎదుర్కుంటాడన్నది చూడాలి. ఐపీఎల్‌లో తొలిసారి అతనో జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అటు అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో, వన్డేల్లో అతని ప్రదర్శన మెరుగ్గా ఉన్నా.. టీ20ల్లో మాత్రం అంతంతమాత్రమే. జట్టును విజయాల బాటలో నడిపిస్తూ.. తిరిగి అభిమానుల మద్దతు సంపాదించాల్సిన భారం అతనిపై ఉంది. ఇక విదేశీ ఆటగాళ్ల నుంచి తుది జట్టులోకి నలుగురిని ఎంచుకోవడం కూడా సవాలే.

దేశీయ ఆటగాళ్లు: అబ్దుల్‌ సమద్‌, రాహుల్‌ త్రిపాఠి, మయాంక్‌ అగర్వాల్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, ఉపేంద్ర సింగ్‌, నితీశ్‌ కుమార్‌, అభిషేక్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, సన్వీర్‌ సింగ్‌, జాతవేద్‌ సుబ్రహ్మణ్యన్‌, ఆకాశ్‌ సింగ్‌, షాబాజ్‌ అహ్మద్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, మయాంక్‌ మార్కండే.

విదేశీయులు: కమిన్స్‌ (కెప్టెన్‌), మార్‌క్రమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ట్రావిస్‌ హెడ్‌, మార్కో యాన్సెన్‌, హసరంగ, ఫజల్‌ హక్‌ ఫారూఖీ; కీలక ఆటగాళ్లు: కమిన్స్‌, హెడ్‌, హసరంగ, వాషింగ్టన్‌ సుందర్‌, క్లాసెన్‌.

ఉత్తమ ప్రదర్శన: 2016లో ఛాంపియన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని