సంక్షిప్త వార్తలు

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఇకమీదట అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌గా జరుగనుంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌ల సిరీస్‌గా కొనసాగిన ఈ ట్రోఫీకి మరో టెస్టును చేర్చినట్లు సోమవారం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది.

Published : 26 Mar 2024 03:26 IST

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ.. ఇక 5 టెస్టులు

దిల్లీ: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఇకమీదట అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌గా జరుగనుంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌ల సిరీస్‌గా కొనసాగిన ఈ ట్రోఫీకి మరో టెస్టును చేర్చినట్లు సోమవారం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. 2024-25 సిరీస్‌ షెడ్యూల్‌ త్వరలో విడుదల కానుంది. ‘‘1991-92 తర్వాత తొలిసారిగా భారత్‌, ఆసీస్‌లు అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి. 2024-25 వేసవిలో ముఖ్యమైన టోర్నీగా నిలిచే బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూల్‌ త్వరలోనే విడుదలవుతుంది’’ అని సీఏ పేర్కొంది.


అది సమష్టి నిర్ణయం: పొలార్డ్‌

అహ్మదాబాద్‌: గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ దాడిని ఆరంభించడాన్ని ముంబయి ఇండియన్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ కీరన్‌ పొలార్డ్‌ సమర్థించాడు. హార్దిక్‌ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం సమష్టి నిర్ణయమని అన్నాడు. ‘‘ఒక జట్టుకు ఏం కావాలన్నది ప్రణాళిక రచించాలి. నిర్ణయాలు తీసుకోవాలి. హార్దిక్‌ గుజరాత్‌ తరఫున కూడా కొత్త బంతితో బౌలింగ్‌ చేశాడు. స్వింగ్‌ కూడా చేశాడు. స్వింగవుతున్న కొత్త బంతిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాం. మా నిర్ణయంలో తప్పు లేదు’’ అని పొలార్డ్‌ చెప్పాడు. ‘‘ఏ నిర్ణయం కూడా ఒక్కరు తీసుకున్నది కాదు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం అతడి నిర్ణయమని చెప్పలేం. జట్టుగా మాకు ప్రణాళికలు ఉన్నాయి’’ అని అన్నాడు.


జై షాతో ఇషాన్‌ మాటామంతి

అహ్మదాబాద్‌: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టు కోల్పోయిన భారత వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌, బోర్డు కార్యదర్శి జై షా మధ్య సంభాషణ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌ అనంతరం ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు ఇషాన్‌తో షా మాటామంతి ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అలసట కారణంగా అర్ధంతరంగా తిరిగొచ్చిన ఇషాన్‌ దేశవాళీ క్రికెట్‌ ఆడేందుకు ఇష్టపడలేదు. భారత జట్టు మేనేజ్‌మెంట్‌ పదే పదే సూచనలు చేసినా రంజీ ట్రోఫీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ముంబయి కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యతో కలిసి ఇషాన్‌ బరోడాలో ఐపీఎల్‌ కోసం సాధన చేసేందుకు మొగ్గు చూపాడు. రాజస్థాన్‌తో ఝార్ఖండ్‌ చివరి రంజీ మ్యాచ్‌ ఆడాలన్న బోర్డు సూచననూ పెడచెవిన పెట్టడంతో అతనికి సెంట్రల్‌ కాంట్రాక్టు దక్కలేదు. ఈ నేపథ్యంలో భారత జట్టు సారథి రోహిత్‌శర్మ సమక్షంలో షాతో సరదా సంభాషణ ఇషాన్‌కు సానుకూల సంకేతమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.


శుభ్‌మన్‌ కొత్త అనిపించలేదు: సాయికిశోర్‌

అహ్మదాబాద్‌: హార్దిక్‌ పాండ్య స్థానంలో ఐపీఎల్‌ జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ కొత్త సారథిగా నియమితుడైన శుభ్‌మన్‌ గిల్‌.. కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో జట్టుకు మంచి ఆరంభాన్నివ్వడమే కాక.. అనంతరం కెప్టెన్‌గా బౌలింగ్‌, ఫీల్డింగ్‌ వ్యూహాలతో ముంబయికి చెక్‌ పెట్టాడు. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ముంబయి 169 పరుగుల ఛేదనలో విఫలం కావడంలో శుభ్‌మన్‌ కెప్టెన్సీ కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో శుభ్‌మన్‌పై ఆ జట్టు స్పిన్నర్‌ సాయికిశోర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘గిల్‌ జట్టును గొప్పగా నడిపించాడు. అతను తొలిసారి సారథిగా వ్యవహరిస్తున్నట్లు అనిపించలేదు. ఒక స్పిన్నర్‌గా నాకు తన చిట్కాలు ఎంతో ఉపయోగపడ్డాయి. మేం 10 పరుగులు తక్కువ చేశామనిపించింది. కానీ సమష్టిగా ఆడి గెలిచాం. పోరాటం మా తత్వం. గెలిచినా, ఓడినా మేం ఆడే తీరు పట్ల గర్విస్తాం. కోచ్‌ అశిష్‌ నెహ్రా ఇదే విషయం మాకు ఎప్పుడూ చెబుతుంటాడు. గత రెండేళ్లలో జట్టు తత్వాన్ని పెంపొందించడంలో ఆయన పాత్ర కీలకం’’ అని సాయికిశోర్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని