Rohit Sharma: కెప్టెన్‌గా నా పాత్ర కీలకమయ్యేదప్పుడే.. ఆ బాధ్యతలు చాలా కష్టం: రోహిత్ శర్మ

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) జట్టులోని ఆటగాళ్లకు ఎప్పుడూ స్వేచ్ఛ ఇస్తుంటాడు. దాంతో మెరుగైన ప్రదర్శన చేయడానికి మరింత ఆస్కారముంటుంది.

Updated : 11 Feb 2024 10:46 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో తన కెప్టెన్సీ పాత్రపై రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం, వారి పట్ల నమ్మకం ప్రదర్శించడం చాలా ముఖ్యమని తెలిపాడు. ముంబయి వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ‘నిర్ణయాలు తీసుకోవడంలో సారథి బాధ్యతలు’, ‘ఓపెనర్‌గా జట్టులో పాత్ర’ అంశాలపై అతడు మాట్లాడాడు.

‘‘జట్టుకు నాయకత్వం వహించడం ఎప్పుడూ కత్తిమీద సామే. బయట నుంచి చూసేవారికి చాలా ఈజీగా అనిపిస్తుంది. కెప్టెన్‌ ఒక ఆలోచనా విధానంతో వస్తాడు. అభిమానులు మాత్రం తాము అనుకున్నదే సారథి చేయాలని కోరుకుంటారు. జట్టుగా ఆడాల్సిన గేమ్‌ క్రికెట్‌. టీమ్‌లోని ప్రతి ఒక్కరి సహకారం ఉండాలి. నా ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కనీసం 10 బంతులే ఆడినా ఫర్వాలేదు. మ్యాచ్‌లో విజయం సాధించడానికి అవే కీలకమవుతాయి. ఇదంతా జరగాలంటే.. ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం నింపాలి. తుది జట్టులోని 11 మంది తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలి.

ప్రతి ఆటగాడితో నేను వ్యక్తిగతంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటా. వారితో డిన్నర్లకు వెళ్తా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కెప్టెన్‌ వైపు వారు చూస్తారు. అలాంటప్పుడు అందుబాటులో లేకపోతే చాలా అసౌకర్యంగా భావిస్తారు. అందరికీ ఒకేలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి. జట్టులో వారి పాత్ర ఏంటనే దానిపై స్పష్టత ఇవ్వాలి. ఒకవేళ ఎవరినైనా మేనేజ్‌మెంట్ తప్పించాలనే ఆలోచన చేస్తే.. అప్పుడు కెప్టెన్‌గా నేను కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అలాంటి ఆటగాళ్లతో చర్చించి ఆత్మవిశ్వాసం కలిగేలా చూడాలి. ఇప్పటి వరకూ నేను చేసిందదే. ఇది చాలా క్లిష్టమైన పనే’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

ఓపెనర్‌గా..

‘‘ఓపెనర్‌గా.. ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా జట్టు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తా. సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటా. ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఎప్పుడూ కష్టమే. పిచ్‌ ఎలా స్పందిస్తుందో తెలియదు. అందుకోసం ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ప్రతి మ్యాచ్‌కు ముందు తీవ్రంగా శ్రమిస్తా. తొలి ఓవర్‌లోనే ఒక షాట్‌ కొట్టాలని భావిస్తే.. దానిని ముందే ప్రాక్టీస్‌ చేసి వస్తా. ఒక్కసారి అలాంటి షాట్‌ ఆడితే ఆత్మవిశ్వాసం తప్పకుండా పెరుగుతుంది. ఇన్నింగ్స్‌పైనా ఆ ప్రభావం ఉంటుంది’’ అని హిట్‌మ్యాన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని