Bishan Singh Bedi: క్రికెట్‌ దిగ్గజం బిషన్‌ సింగ్‌ బేడీ ఇకలేరు

భారత క్రికెట్‌ దిగ్గజం బిషన్‌ సింగ్‌బేడీ (77) ఇక లేరు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు.

Published : 24 Oct 2023 01:15 IST

దిల్లీ: భారత క్రికెట్‌ దిగ్గజం, టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడీ (77) ఇక లేరు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. తన ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్‌తో ఆయన క్రీడాభిమానులకు ఎన్నో చిరస్మరణీయ క్షణాలను అందించారు. బిషన్‌ సింగ్ బేడీ భారత్‌ తరఫున 1966 నుంచి 1979 వరకు ఆడారు. 67 టెస్టుల్లో 266 వికెట్లు తీశారు. బిషన్‌ సింగ్‌ బేడీ (Bishan singh Bedi) 22 మ్యాచ్‌లకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. 10 వన్డేల్లో ఆడి 7 వికెట్లు తీశారు. అప్పట్లో భారత్‌ నుంచి అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా ప్రసిద్ధిగాంచారు. స్పిన్ బౌలింగ్ రివల్యూషన్‌ రూపశిల్పులలో ఒకరిగా క్రికెట్‌లో తనదైన ముద్ర వేశారు. బిషన్‌సింగ్‌ బేడీ 1976లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు. ఆయనకు భార్య అంజు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

భారత్‌ తొలి వన్డే విజయంలో ఎరపల్లి ప్రసన్న, బీఎస్‌ చంద్రశేఖర్, ఎస్‌. వెంకటరాఘవన్‌లతో కలసి కీలక పాత్ర పోషించారు. 1975 ప్రపంచ కప్‌లో భాగంగా ఈస్ట్‌ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తన అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు (12-8-6-1)తో ఆ జట్టును 120 పరుగులకే కట్టడి చేశారు. క్రికెట్‌లో ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1970లోనే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1990లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ పర్యటనల సమయంలో భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా ఉన్నారు. జాతీయ సెలెక్టర్‌గానే కాకుండా మణిందర్ సింగ్, మురళీ కార్తిక్ వంటి అనేక మంది ప్రతిభావంతులైన స్పిన్నర్లకు మెంటార్‌గా ఉన్నారు. 2004లో సీకే నాయుడు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. 

బిషన్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధాని మోదీ, ఖర్గే విచారం

ప్రముఖ క్రికెటర్‌ బిషన్‌ సింగ్‌ బేడీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. క్రికెట్‌ పట్ల ఆయనకు ఉన్న అభిరుచి అచంచలమైందని.. తన స్పిన్‌ బౌలింగ్‌తో భారత్‌కు పలు చిరస్మరణీయ విజయాలు అందించడంలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు.  భవిష్యత్తు తరాల క్రికెటర్లకు ఆయన స్ఫూర్తిమంతంగా నిలుస్తారని పేర్కొన్నారు. బిషన్‌ సింగ్‌ బేడీ కుటుంబ సభ్యులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్‌ చేశారు. క్రికెట్ ప్రేమికులు 'ది సర్దార్ ఆఫ్ స్పిన్' అంటూ ముద్దుగా పిలుచుకొనే బిషన్‌ సింగ్‌ ప్రసిద్ధమైన క్రికెటర్లలో ఒకరని, ఆయన మరణ వార్త చాలా బాధించిందని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. క్రీడా రంగానికి అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ఖర్గే ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరోవైపు, బిషన్‌ సింగ్‌ బేడీ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో పాటు ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటూ పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. బిషన్‌ సింగ్‌ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌, బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌, మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌తో పాటు పలువురు ప్రముఖులు ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్టులు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని