Asia Cup: ‘హైబ్రిడ్ మోడల్‌’ను వ్యతిరేకించిన జకా అష్రాఫ్‌.. ఐదు దేశాలతోనేనా ఆసియా కప్‌!

ఆసియా కప్‌ (Asia Cup 2023) నిర్వహణ ఓ కొలిక్కి వచ్చేసిన సందర్భంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కొత్త ఛైర్మన్‌ (PCB) జకా అష్రాప్‌ చేసిన వ్యాఖ్యలు మరో చర్చకు తెరదీసింది. ఆగస్ట్‌ 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్‌ జరగాల్సి ఉంది.

Updated : 22 Jun 2023 12:10 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డుకు (PCB) కొత్త ఛైర్మన్ వచ్చారు. నజమ్‌ సేథీ స్థానంలో జకా అష్రాఫ్ బాధ్యతలు చేపట్టారు. గతంలోనూ పీసీబీ ఛైర్మన్‌గా చేసిన అనుభవం జకా అష్రాఫ్‌కు ఉంది. అయితే, వచ్చీ రాగానే అష్రాఫ్ ఓ బాంబు పేల్చారు. మరి అది ఎటువైపు దారి తీస్తుందో మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ అవేంటంటే? 

‘‘ఆసియా కప్‌ కోసం (Asia Cup 2023) ఇటీవల ప్రతిపాదించిన హైబ్రిడ్‌ మోడల్‌ను (Hybrid Model) తిరస్కరిస్తున్నా. ఎందుకంటే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ పాక్‌ వేదికగా నిర్వహించాలని గతంలో నిర్ణయించింది. మేం ఆతిథ్యం ఇవ్వాలి. కానీ, ఆ తర్వాత పరిణామాలతో హైబ్రిడ్‌ మోడల్‌ను తీసుకొచ్చారు. అందుకే నేను దీనిని అంగీకరించడం లేదు’’ అని అష్రాఫ్ తెలిపారు. 

అష్రాఫ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) పాకిస్థాన్‌ పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. ఆసియా కప్‌ నిర్వహణపై ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ (ACC) ఓ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు బీసీసీఐ కూడా పట్టువిడవకపోవచ్చు. గత ఛైర్మన్ నజమ్‌ సేథీ ప్రతిపాదించిన ‘హైబ్రిడ్ మోడల్‌’ను ఏసీసీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ప్రస్తుత పీసీబీ ఛైర్మన్‌ అష్రాఫ్‌ తన వైఖరి మార్చుకోకపోతే మాత్రం ఆసియా కప్‌ నిర్వహణపై ఏసీసీ కీలక నిర్ణయం తీసుకుంటుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పాక్‌ లేకుండానే మిగతా ఐదు దేశాలతోనే ఆసియా కప్‌ను నిర్వహించేందుకూ వెనుకాడేది లేదని ఏసీసీ ప్రతినిధులు పేర్కొన్నారు. ‘‘ఆసియా కప్‌ నిర్వహణ మోడల్‌ను ఏసీసీ ఆమోదించింది. అందులో ఎటువంటి మార్పులు ఉండవు. అష్రాప్‌ తన వాదన వినిపించే స్వేచ్ఛ ఉంది’’ అని ఏసీసీ బోర్డు మెంబర్ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని