ODI WC 2023: ఐసీసీ అవార్డు కోసం బుమ్రా నామినేటెడ్‌.. పాక్‌ సెమీస్‌కి వచ్చినా ఏకపక్షమేనట!

Published : 07 Nov 2023 17:25 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) మరోసారి దాయాదుల పోరును చూస్తామా..? ఇప్పటికే భారత్ సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో నాకౌట్‌లో తలపడాల్సి ఉంటుంది. దాని కోసం పాక్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒకవేళ భారత్-పాక్‌ మ్యాచ్‌ జరిగినా ఏకపక్షమే అవుతుందని మాజీ క్రికెటర్‌ జోస్యం చెప్పాడు. మరోవైపు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కోసం టీమ్‌ఇండియా స్టార్‌పేసర్ నామినేట్‌ కావడం విశేషం. శ్రీలంకతో వివాదాస్పద నిర్ణయం తీసుకున్న బంగ్లా సారథి వరల్డ్‌ కప్‌ చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇలాంటి వరల్డ్‌ కప్‌ సంగతులు మీ కోసం..

సెమీస్‌కు పాక్‌ వస్తుంది.. మళ్లీ ఏకపక్ష మ్యాచ్‌ ఖాయం: కైఫ్‌

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో టీమ్‌ఇండియా (16) ఇప్పటికే సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకుంది. వరుసగా ఎనిమిది మ్యాచుల్లో గెలిచి ఊపుమీదుంది. వచ్చే ఆదివారం నెదర్లాండ్స్‌తో చివరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తలపడనుంది. మరోవైపు నాలుగో స్థానం కోసం పాక్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పాక్‌ కూడా నాలుగో స్థానంలో నిలిచి సెమీస్‌కు వస్తే భారత్‌తో తలపడాల్సి ఉంటుంది. ఇప్పటికే 8-0 రికార్డుతో టీమ్‌ఇండియా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్‌ మాట్లాడుతూ.. ‘‘పాక్‌ సెమీస్‌కు చేరుకుంటుంది. కానీ, ఆ మ్యాచ్‌ కూడా ఏకపక్షమే అవుతుంది. గత చరిత్రను తెరిచి చూస్తే ఇదే అర్థమవుతుంది. భారత్ జట్టు వారిని సులువుగా ఓడించగలదు. ఇంగ్లాండ్‌పై భారీ విజయం సాధిస్తే తప్పకుండా పాక్‌ సెమీస్‌కు వచ్చే అవకాశ ఉంది. అయితే, నెట్‌రన్‌రేట్‌ను మరింత మెరుగుపర్చుకునేలా వారి గెలుపు ఉంటేనే ఇది సాధ్యం’’ అని కైఫ్ వ్యాఖ్యానించాడు. 


ప్లేయర్ ఆఫ్‌ ది మంత్‌ ఐసీసీ అవార్డు కోసం బుమ్రా

టీమ్‌ఇండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో వరల్డ్‌ కప్‌లో అదరగొట్టేస్తున్నాడు. ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్ ది మంత్’ అక్టోబర్‌ అవార్డు కోసం ముగ్గురు పేర్లు నామినేట్‌ అయ్యాయి. అందులో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్ రచిన్‌ రవీంద్ర, దక్షిణాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్ డికాక్‌ కూడా ఈ రేసులో నిలిచారు. బుమ్రా ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 15 వికెట్లు తీశాడు. పవర్‌ప్లే ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేసి ప్రత్యర్థులను ఒత్తిడికి గురి చేశాడు. మరీ ముఖ్యంగా అక్టోబర్‌ 29న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. కేవలం 230 పరుగులను రక్షించుకోవడంలో షమీతోపాటు బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీశాడు. 


చివరి మ్యాచ్‌కు షకిబ్‌ అల్‌ హసన్ దూరం

శ్రీలంకతో మ్యాచ్‌లో షకిబ్‌ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మాథ్యూస్‌ ‘టైమ్డ్‌ ఔట్’ కావడంలో షకిబ్ అప్పీలే ప్రధాన కారణం . అయితే, ఆ మ్యాచ్‌లో షకిబ్ తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయగా.. బ్యాటింగ్‌లోనూ విలువైన 82 పరుగులు సాధించి బంగ్లా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఇప్పటికే సెమీస్‌ రేసు నుంచి నిష్ర్కమించిన బంగ్లా ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత అవకాశాల కోసం తీవ్రంగా కష్టపడుతోంది. ఇలాంటి సమయంలో తన చివరి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో నవంబర్ 11న బంగ్లా ఆడనుంది. కానీ, ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌ షకిబ్ అల్ హసన్‌ దూరమవుతాడని ఆ దేశ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు చూపుడు వేలికి గాయం కావడం, ఎక్స్‌రేలోనూ ఫ్రాక్చర్‌ నిర్థరణ కావడంతో చివరి మ్యాచ్‌ ఆడడని బంగ్లా బోర్డు తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని