Ravi Shastri : టీమ్‌ఇండియాకు ఆ ట్యాగ్‌ సరికాదు.. మనది బలమైన జట్టే : రవిశాస్త్రి

మెగా టోర్నీల్లో విఫలమవుతున్న టీమ్‌ఇండియాపై వస్తున్న విమర్శలపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి(Ravi Shastri) స్పందించాడు. అలాగే ఐసీసీ(ICC) టోర్నీల్లో గెలవాలంటే ఏం చేయాలో కూడా సూచించాడు.

Updated : 26 Jun 2023 17:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  టీమ్‌ఇండియా(Team India) గత కొంతకాలంగా ఐసీసీ(ICC) ఈవెంట్లలో వరుసగా విఫలమవుతోంది. మహేంద్ర సింగ్‌ ధోనీ నేతృత్వంలో 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గిన అనంతరం.. భారత్‌ మరో ఐసీసీ ట్రోఫీ నెగ్గలేదు. ఇటీవల రెండోసారి WTC Finalకు చేరినప్పటికీ.. ఖాళీ చేతులతోనే రోహిత్‌ సేన తిరిగివచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు విమర్శలు గుప్పిస్తూ.. టీమ్‌ఇండియాకు ‘చోకర్స్‌’(chokers) ట్యాగ్‌ను తగిలిస్తున్నారు.

కీలకమైన టోర్నీల్లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసే టీమ్‌లను ఉద్దేశించి క్రికెట్‌ పరిభాషలో ‘చోకర్స్’గా అభివర్ణిస్తారు. అయితే.. మాజీ కోచ్‌ రవిశాస్త్రి(Ravi Shastri) దీనిపై స్పందించాడు. భారత జట్టుకు ఇలాంటి ట్యాగ్‌ తగిలించడం సరికాదని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా బలమైన జట్టని.. ఇటీవల ఐసీసీ టోర్నమెంట్లలో సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ వరకూ చేరుకుందని వివరించాడు.

‘‘నేను అలా అనను. మూడు ప్రపంచకప్‌లు గెలిచే అవకాశం ఉన్న రెండు జట్లు భారత్‌, ఆస్ట్రేలియా మాత్రమే. పెద్ద టోర్నీల్లో మనం బోల్తా పడుతున్నామని కాదు. మనం సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాం. ఫైనల్స్‌ వరకూ వెళ్లాం’’ అని శాస్త్రి ఓ మీడియాతో మాట్లాడుతూ వివరించాడు.

ఇక ఐసీసీ ట్రోఫీలను గెలవనందుకు వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దని శాస్త్రి సూచించాడు. ‘పెద్ద టోర్నీల్లో గెలవాలంటే.. సమష్టి కృషి అవసరం. కావున.. వైఫల్యాలకు ఒక వ్యక్తినో, సారథినో నిందించలేరు’ అని పేర్కొన్నాడు. 

పెద్ద టోర్నీల్లో గెలవాలంటే..

ప్రపంచకప్‌, WTC Finalలాంటి మెగా టోర్నీల్లో గెలవాలంటే.. బ్యాటర్ల నుంచి పెద్ద ఇన్నింగ్స్‌లు రావాల్సిన అవసరముందని శాస్త్రి గట్టిగా చెప్పాడు. ‘ప్రపంచకప్‌, WTC Finalsలో బ్యాటర్ల నుంచి శతకాలు అవసరం. అప్పుడే బౌలర్లకు సులవవుతుంది. ట్రోఫీ గెలుచుకునే మంచి అవకాశాలు ఉంటాయి. టీ20, టెస్టు, వన్డేలు ఏ ఫార్మాటైనా.. మీరు శతకం చేయలేకపోతే.. కనీసం మూడు అర్ధ శతకాలు ఉండేలా చూసుకొండి. అలా చేయకపోతే.. మీకు గెలిచే అర్హత లేదు’ అని పేర్కొన్నాడు.

ఇక టీమ్‌ఇండియా.. వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్‌(IND vs WI) పర్యటన చేపట్టబోతోంది. ఆ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇప్పటికే టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ(BCCI) ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని