IND vs ENG: టీమ్‌ఇండియాకు షాక్.. మూడో టెస్టుకూ జడేజా డౌటే!

ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టుకు కూడా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా దూరమయ్యే అవకాశముంది. 

Published : 01 Feb 2024 21:12 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా (Team India)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వ్యక్తిగత కారణాల వల్ల మొదటి రెండు టెస్టులకు దూరం కాగా.. గాయాల కారణంగా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), బ్యాటర్ కేఎల్ రాహుల్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండట్లేదు. తొలి టెస్టులో సింగిల్ తీసే ప్రయత్నంలో జడేజాకు తొడ కండరాలకు గాయమైంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌లో అకాడమీలో కోలుకుంటున్నాడు. రాజ్‌కోట్‌లో ఫిబ్రవరి 15నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టుకు కూడా జడ్డూ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అతడు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి నాలుగు నుంచి ఎనిమిది వారాల సమయం పట్టే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఫిట్‌నెస్‌ సాధిస్తే రాంచీలో జరిగే నాలుగో టెస్టుకు అందుబాటులో ఉంటాడు.   

ఎన్‌సీఏకు కేఎల్ రాహుల్ 

కేఎల్ రాహుల్ (KL Rahul) మాత్రం మూడో టెస్టులో ఆడే ఛాన్స్‌ ఉంది. శుక్రవారం అతడు జాతీయ క్రికెట్‌ అకాడమీకి వెళ్లనున్నాడు. తొలి టెస్టు సమయంలో కుడి తొడ నొప్పితో బాధపడుతున్న టీమ్ మేనేజ్‌మెంట్‌కు రాహుల్‌ తెలియజేశాడు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా రెండో మ్యాచ్‌కు అతడికి విశ్రాంతినిచ్చారట. మూడో టెస్టు నాటికి అతడు ఫిట్‌నెస్‌ సాధించే అవకాశముంది. మహ్మద్‌ షమి ఇంగ్లాండ్‌తో చివరి మూడు టెస్టులకూ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతడు చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. షమి ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. గాయానికి శస్త్రచికిత్స చేయించుకుంటాడా, లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని