Team India: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఆసియా కప్‌ బరిలో బుమ్రా, కేఎల్!

గాయాలు కారణంగా క్రికెట్‌కు దూరమైన టీమ్‌ఇండియా (Team India) సీనియర్‌ క్రికెటర్లు బుమ్రా, కేఎల్ రాహుల్‌ త్వరలోనే మైదానంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Published : 29 Jun 2023 16:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) క్రికెట్ అభిమానులకు శుభవార్త. గాయం కారణంగా జాతీయ క్రికెట్‌ అకాడమీలో (NCA) విశ్రాంతి తీసుకుంటున్న భారత స్టార్‌ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్‌ త్వరలోనే మైదానంలోకి దిగబోతున్నారు. ఆగస్ట్‌ 31 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో బరిలోకి దిగుతారని క్రికెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఆసియా కప్‌ కోసం జట్టు ఎంపికకు వీరిద్దరూ అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. అయితే, బీసీసీఐ నుంచి లేదా ఎన్‌సీఏ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

గతేడాది సెప్టెంబర్‌ నుంచి బుమ్రా క్రికెట్ ఆడటం లేదు. టీ20 ప్రపంచ కప్‌ 2022,  బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ, ఐపీఎల్‌ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ఇలా వరుసగా కీలకమైన టోర్నీల్లోనూ వెన్ను నొప్పి కారణంగా వైదొలిగాడు. వెస్టిండీస్‌ పర్యటన తర్వాత  జరిగే ఐర్లాండ్‌ సిరీస్‌లో ఆడిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, వాటన్నింటినీ ఎన్‌సీఏ వర్గాలు కొట్టిపడేశాయి. బుమ్రా రోజూ ఏడేసి ఓవర్ల చొప్పున బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఆసియా కప్‌ టోర్నీకి మరో నెల రోజుల సమయం ఉండటంతో ఆలోగా పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్‌ సాధిస్తాడనే ఆశాభావంతో ఉన్నట్లు ఎన్‌సీఏ వర్గాలు వెల్లడించాయి. 

ఐపీఎల్‌ 2023 సీజన్‌ మధ్యలో మోకాలి గాయం కారణంగా వైదొలిగిన కేఎల్ రాహుల్‌ కూడా కోలుకుంటున్నాడు. తాజాగా జిమ్‌లో శ్రమిస్తోన్న ఫొటోలను రాహుల్‌ తన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నాడు.  శ్రేయస్‌ అయ్యర్ విషయంలోనూ సెలెక్షన్ కమిటీ ఆచితూచి వ్యవహరిస్తోందని.. ఒకవేళ పూర్తిగా కోలుకోని పక్షంలో సంజూశాంసన్‌ లేదా సూర్యకుమార్‌ యాదవ్‌ను పరిశీలించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని