IND vs ENG: జట్టుగా విఫలమయ్యామన్న రోహిత్‌.. ఐదో స్థానానికి పడిన భారత్‌

ఉప్పల్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో (IND vs ENG) భారత్‌కు ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి ఎదురైంది. మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించినా పరాజయం మాత్రం తప్పలేదు.

Published : 28 Jan 2024 20:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఉప్పల్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ చేతిలో (IND vs ENG) ఓడిపోవడంపై టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. నాలుగు రోజులపాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఎక్కడ పొరపాటు జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమని.. జట్టుగా విఫలమయ్యామని మాత్రమే చెప్పగలనని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఓలీ పోప్ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ దూరమైందని పేర్కొన్నాడు. 

‘‘తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం సాధించాం. మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించామని భావించాం. కానీ, భారత పిచ్‌ పరిస్థితుల్లో విదేశీ ప్లేయర్‌ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించడం చూశాం. ఓలీ పోప్ సూపర్ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించడానికి ప్రధాన కారణం అతడే. మా బౌలర్లు తమ ప్రణాళికలను సరిగ్గానే అమలు చేశారు. కానీ, వాటన్నింటినీ పోప్‌ పటాపంచలు చేస్తూ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 230 పరుగుల లక్ష్యం ఛేదించగలమని భావించా. తొలుత పిచ్‌ నుంచి టర్నింగ్‌ భారీగా వస్తుందని ఊహించలేదు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో మేం బ్యాటింగ్‌ సరిగ్గా చేయలేదు. సిరాజ్‌ - బుమ్రా మ్యాచ్‌ను చివరి రోజుకు తీసుకెళ్తారని భావించా. చివరి రోజు 20 లేదా 30 పరుగులు చేయడం పెద్ద కష్టమేం కాదు. ఏదైనా సాధ్యమే. లోయర్‌ ఆర్డర్‌ చాలా పోరాడింది. టాప్‌ ఆర్డర్‌ నేర్చుకోవాల్సిందదే. కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, మరికొన్నింటిని జారవిడుచుకున్నాం. సిరీస్‌లో ఇదే తొలి మ్యాచ్‌. ఓటమి నుంచి నేర్చుకుని మున్ముందు మ్యాచ్‌ల్లో రాణిస్తామనే నమ్మకం ఉంది’’ అని రోహిత్ తెలిపాడు. 

కెప్టెన్‌గా ఎన్నో అద్భుత క్షణాలు: బెన్‌ స్టోక్స్

‘‘నేను కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో అద్భుత క్షణాలను ఆస్వాదిస్తున్నా. చాలా అద్భుతమైన విజయాలను నమోదు చేస్తున్నాం. సారథిగా తొలిసారి భారత్‌కు వచ్చిన నాకు శుభారంభం దక్కడం ఆనందంగా ఉంది. నేను మ్యాచ్‌ను ఎక్కువగా గమనిస్తూ ఉంటా. ప్రత్యర్థి కెప్టెన్‌ ఎలా ఫీల్డింగ్‌ను సెట్‌ చేస్తున్నాడు..? బౌలింగ్‌లో ఎలాంటి మార్పులు చేస్తున్నాడు? అనేది నిరంతరం చూస్తుంటా. రోహిత్‌ చాలా అద్భుతంగా ఫీల్డింగ్‌ సెటప్ పెట్టాడు. దాని నుంచి ఎంతో నేర్చుకున్నా. టామ్‌ హార్ట్‌లే అరంగేట్రంలోనే సూపర్ ప్రదర్శన చేశాడు. అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు ఎక్కువ ఓవర్లు ఇచ్చా. ఈ మ్యాచ్‌ విజయంలో మా బ్యాటర్ ఓలీ పోప్‌ కీలక పాత్ర పోషించాడు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడటం ఆషామాషీ వ్యవహారం కాదు. ఉపఖండం పిచ్‌పై ఇంగ్లాండ్ బ్యాటర్‌ నుంచి వచ్చిన అద్భుత ఇన్నింగ్స్‌ల్లో ఇదే అత్యుత్తమం’’ అని బెన్‌ స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు. 

100 శాతం అద్భుత ఇన్నింగ్స్‌: ఓలీ పోప్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

‘‘భారత్‌లో విదేశీ బ్యాటర్లకు కఠిన సవాల్‌ తప్పదు. ఇలాంటి పిచ్‌పై భారీ శతకం చేయడం అద్భుతమనిపిస్తోంది. ఇదే అత్యుత్తమం. రెండో ఇన్నింగ్స్‌లో కొన్నిసార్లు అదృష్టం కూడా నాకు కలిసొచ్చింది. స్లిప్‌లో క్యాచ్‌ జారిపోయిన తర్వాత కాస్త స్థిమితపడ్డా. దాంతో ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ కాకుండా ఉండేందుకు దృష్టిసారించా. ఈ సిరీస్‌ కోసం నా టెక్నిక్స్‌లోనూ కొన్ని మార్పులు చేసుకున్నా. స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌ షాట్లను ప్రయత్నించా’’ అని ఓలీ పోప్‌ తెలిపాడు.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో..

ఇంగ్లాండ్‌పై ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో భారత్ (43.33 శాతం) ఐదో స్థానానికి వెళ్లిపోయింది. ఈ టెస్టుకు ముందు రెండో ర్యాంక్‌లో ఉండేది. డే/నైట్‌ టెస్టులో విండీస్‌ చేతిలో ఓటమిపాలైనప్పటికీ ఆస్ట్రేలియా (55) అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా (50 శాతం), న్యూజిలాండ్‌ (50 శాతం), బంగ్లాదేశ్‌ (50 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని