Cricket News: రోహిత్ క్లీన్‌బౌల్డ్.. భారత ఫ్యాన్‌కు కమిన్స్‌ రిప్లై.. అవన్నీ రూమర్లేనన్న వరుణ్!

Published : 14 Feb 2024 17:11 IST

ఇంటర్నెట్ డెస్క్: మూడో టెస్టు కోసం శ్రమిస్తోన్న భారత కెప్టెన్ రోహిత్‌ను (Rohit Sharma) స్థానిక యువ బౌలర్ రెండు బౌల్డ్ చేశాడని వార్తలు.. తన భార్యను ప్రేమిస్తున్నానని పోస్టు చేసిన భారత అభిమానికి కమిన్స్ సమాధానం.. గాయంపై రూమర్లను వ్యాప్తి చేయడం వల్లే జట్టులో స్థానం దక్కలేదన్న వరుణ్‌ చక్రవర్తి.. ఇలాంటి క్రికెట్ విశేషాలు.. 

ఇన్‌స్వింగ్‌.. అవుట్‌ స్వింగ్‌ బంతులకు హిట్‌మ్యాన్‌ బోల్తా

ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. దీంతో భారత ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. తొలి రెండు టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ గొప్ప ప్రదర్శన చేయలేదు. దీంతో మూడో టెస్టులో రాణించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో రాజ్‌కోట్‌లో ప్రాక్టీస్‌ సందర్భంగా ఓ స్థానిక బౌలర్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో రెండు సార్లు రోహిత్ క్లీన్‌బౌల్డ్‌ అయినట్లు వార్తలు వచ్చాయి. తొలి బంతి ఇన్‌స్వింగ్‌ కాగా.. రెండో బంతి అవుట్‌స్వింగర్‌ కావడం గమనార్హం. 


మీ ఆవిడను ఇష్టపడుతున్నా.. కమిన్స్‌ స్వీట్ రిప్లై

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నాడు. తాజాగా తన భార్య బెక్కీ కమిన్స్‌తో బీచ్‌లో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ‘‘సూపర్‌ మమ్‌, వైఫ్, అద్భుతమైన సర్ఫర్. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు’’ అని వ్యాఖ్య జోడించాడు. దానికి ఓ భారత అభిమాని.. ‘‘నేను భారతీయుడిని. ఐ లవ్‌ యూ యువర్‌ వైఫ్‌’ అని కామెంట్ చేశాడు. దానికి కమిన్స్ స్పందిస్తూ..‘‘ఆమెకు మీ సందేశం పంపిస్తా’’ అని సరదాగా రిప్లై ఇచ్చాడు. 


నా గాయంపై తప్పుడు ప్రచారం: వరుణ్‌ చక్రవర్తి

తన గాయంపై జరిగిన తప్పుడు ప్రచారం కారణంగానే జాతీయ జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చిందని యవ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి వ్యాఖ్యానించాడు. పొట్టి ప్రపంచ కప్‌ 2021లో కేవలం మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. ఇప్పటి వరకు మళ్లీ ఎంపిక కాలేకపోయాడు. ‘‘ ఆ వరల్డ్‌ కప్‌లో కొన్ని మ్యాచ్‌ల తర్వాత జట్టు నుంచి వైదొలగడం నన్ను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. అదేమీ పెద్ద గాయం కాదు. రెండు లేదా మూడు వారాల విశ్రాంతి సరిపోతుంది. కానీ, కొందరు మాత్రం నేను తీవ్రంగా గాయపడినట్లు ప్రచారం చేశారు. దీంతో జాతీయ జట్టులోకి రాలేకపోయా. ఇలా ఎందుకు జరిగిందో కూడా తెలియదు. ఇప్పుడు వాటన్నింటినీ ఆలోచిస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది’’ అని వరుణ్‌ చక్రవర్తి వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కీలక బౌలర్‌గా మారాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని