Rohit Sharma: 0.45 సెకన్లలోనే క్యాచ్‌.. అలాంటివి మరెన్నో పట్టేస్తా: రోహిత్

ఒక్క క్యాచ్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తుంటుంది. అలాంటి క్యాచ్‌ను భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుతంగా ఒడిసిపట్టాడు. 

Updated : 07 Feb 2024 16:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో (IND vs ENG) ఒక క్యాచ్‌, ఒక రనౌట్‌ టీమ్‌ఇండియాను విజయం వైపు నడిపించాయి. కేవలం 0.45 సెకన్లలోనే దూసుకొచ్చిన బంతిని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఒడిసిపట్టాడు. అది ఓలీ పోప్‌ వికెట్. తొలి టెస్టులో భారత్ ఓటమికి కారణమైన 196 పరుగుల ఇన్నింగ్స్‌ను ఆడిన బ్యాటర్. ఇక రెండోది.. పర్యటక జట్టు సారథి బెన్‌ స్టోక్స్‌ను శ్రేయస్‌ అయ్యర్ డైరెక్ట్‌ హిట్‌తో రనౌట్‌ చేశాడు. తాజాగా రోహిత్ తాను పట్టిన క్యాచ్‌ గురించి స్పందించిన వీడియోను బీసీసీఐ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. అశ్విన్‌ బౌలింగ్‌లో పోప్‌ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ పట్టాడు.

‘‘స్లిప్‌లో ఉండే ఫీల్డర్లు నిశ్చలంగా ఉండాలి. ఆ సమయంలో త్వరగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎల్లవేళలా సిద్ధంగా ఉంటూ క్యాచ్‌ కోసం వేచి చూడాలి. ఓలీ పోప్‌ క్యాచ్‌ను పట్టడం ఆనందంగా ఉంది. ఇది చాలా కీలకమైన వికెట్. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడిని త్వరగా పెవిలియన్‌కు చేర్చగలిగాం. ఈ క్యాచ్‌ మాత్రమే కాదు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోని మిగతా మ్యాచుల్లోనూ ఇలాంటివెన్ని వచ్చినా పడతా. కొన్నిసార్లు బంతి చాలా వేగంగా వచ్చేస్తుంది. సత్వరం స్పందించకపోతే బంతి మన శరీరాన్ని గాయపరుస్తుంది. అందుకే, మన చేతులు సరైన సమయానికి సరైన ప్రదేశంలో ఉండాలి’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. 

మిగతా మూడు టెస్టులకు కూర్పు ఎలా ఉంటుందో? 

ఇంగ్లాండ్‌తో మిగతా మూడు టెస్టులకు భారత జట్టును ప్రకటించేందుకు మేనేజ్‌మెంట్ కసరత్తు చేస్తోంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వస్తే ఎవరిని? పక్కన పెడతారనేది ఆసక్తికరంగా మారింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకి విశ్రాంతినిస్తారని తెలుస్తోంది. బుమ్రాకి రెస్ట్‌ ఇస్తే అతడి స్థానంలో సిరాజ్‌ లేదా షమీ వస్తారు. పేస్‌ బౌలింగ్ భారాన్ని మోయాల్సిఉంటుంది. రెండు టెస్టుల్లోనూ విఫలమైన శ్రేయస్‌ అయ్యర్‌ను పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని