T20 WC 2024: టీ20 ప్రపంచకప్‌లో రోహితే సారథి!

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెగా టోర్నీలో జట్టును నడిపించడానికి రోహితే సరైన వ్యక్తని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సెలక్టర్లు సహా బీసీసీఐలో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.

Updated : 06 Dec 2023 09:33 IST

ముంబయి: వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెగా టోర్నీలో జట్టును నడిపించడానికి రోహితే సరైన వ్యక్తని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సెలక్టర్లు సహా బీసీసీఐలో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ ఓటమి అనంతరం బీసీసీఐ ఇటీవలే సమీక్ష సమావేశం నిర్వహించింది. ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బోర్డు కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కోశాధికారి ఆశిష్‌ సెల్లర్‌ సమావేశానికి హాజరయ్యారు. వచ్చే జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు ఎవరు నాయకత్వం వహించాలనే విషయంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆ టోర్నీలో జట్టుకు నాయకత్వం వహించబోయేది తానో కాదో చెప్పాలని, చెబితే సన్నద్ధమవుతానని అందరినీ రోహిత్‌ అడిగినట్లు సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి చెప్పాడు. కెప్టెన్సీకి రోహితే తగినవాడని అంతా ఏకగ్రీవంగా అంగీకరించినట్లు వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో కూడా జట్టును నడిపించాలని వాళ్లు కోరినా.. పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి విశ్రాంతి కావాలని రోహిత్‌ కోరాడని ఆ అధికారి అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత టీ20 జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌, వన్డే జట్టుకు రాహుల్‌ సారథ్యం వహించనున్న సంగతి తెలిసిందే. 2022 టీ20 ప్రపంచకప్‌ తర్వాత రోహిత్‌, కోహ్లి భారత్‌ తరఫున టీ20లు ఆడలేదు.

పంత్‌ శరవేగంగా..

ముంబయి: గత డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న భారత వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ ట్రైనింగ్‌లో వేగాన్ని పెంచాడు. జిమ్‌లో బరువులు ఎత్తుతున్న దృశ్యాలను అతడు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పంచుకున్నాడు. ఏప్రిల్‌ నాటికల్లా ఐపీఎల్‌ జట్టు దిల్లీ క్యాపిటల్స్‌లో చేరాలనే పట్టుదలతో ఉన్న అతడు.. ఇటీవలే నెట్స్‌లోనూ సాధన మొదలుపెట్టాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో స్థానాన్ని ఆశిస్తున్న రిషబ్‌ ముందుగా ఐపీఎల్‌లో ఆడి ఫిట్‌నెస్‌, ఫామ్‌ నిరూపించుకోవాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని