MS Dhoni: ధోనీతో కిట్‌బ్యాగు మోయించిన రైనా!

టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీతో అనుబంధం గురించి సురేశ్‌ రైనా మరోసారి పంచుకున్నాడు. గుజరాత్‌ లయన్స్‌కు సారథ్యం వహిస్తున్నప్పుడు జరిగిన సరదా సంఘటనల గురించి వివరించాడు. ...

Updated : 19 Jul 2021 04:29 IST

మహీతో సరదా సంఘటనలు పంచుకొన్న రైనా

ముంబయి: టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీతో అనుబంధం గురించి సురేశ్‌ రైనా మరోసారి పంచుకున్నాడు. గుజరాత్‌ లయన్స్‌కు సారథ్యం వహిస్తున్నప్పుడు జరిగిన సరదా సంఘటనల గురించి వివరించాడు. ఐర్లాండ్‌లో ధోనీభాయ్‌తో శీతల పానీయాలు తెప్పించుకున్నానని, కిట్‌ బ్యాగు మోయించానని గుర్తు చేసుకున్నాడు.

2016లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై నిషేధం విధించడంతో ‘రైజింగ్‌ పుణె’కు ధోనీ, ‘గుజరాత్‌ లయన్స్‌’కు రైనా సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. అప్పుడు పుణెతో ఆడినప్పుడు విచిత్రమైన అనుభూతి కలిగిందని రైనా అంటున్నాడు.

‘‘అవును, అప్పుడు భావోద్వేగానికి గురయ్యాను. రాజ్‌కోట్‌లో ఆడటం నాకు గుర్తుంది. అశ్విన్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో మెక్‌కలమ్‌ ఉన్నాడు. నేను బ్యాటింగ్‌ చేస్తున్నా. ధోనీభాయ్‌ కీపింగ్‌ చేస్తున్నాడు. డుప్లెసిస్‌ ఫస్ట్‌స్లిప్‌లో నిలబడ్డాడు. అందుకే, మా పొరుగింటి వాళ్లతో కంగా లీగ్‌ ఆడినట్టు అనిపించింది. పైగా నేను క్రీజులోకి వెళ్లినపుడు ‘రండి.. రండి.. కెప్టెన్‌ సాబ్‌’ అని ధోనీ అన్నాడు. ‘వస్తున్నాను భాయ్‌.. ముందు మీరు జరగండి’ అని నేను బదులిచ్చాను’ అని రైనా గుర్తు చేసుకున్నాడు.

2018లో ఐర్లాండ్‌ వెళ్లినప్పుడు మరో సంఘటన జరిగిందని రైనా చెప్పాడు. ‘‘ఆ మ్యాచులో ధోనీభాయ్‌ శీతల పానీయాలు అందించాడు. నేను ప్రతిసారీ గ్లోవ్స్‌, బ్యాట్ల కోసం పిలుస్తుండటంతో అతడు నా కిట్‌బ్యాగ్‌ మొత్తం మోసుకొచ్చాడు. ‘ఏం కావాలో తీసుకో. మళ్లీ మళ్లీ పిలవకు. ఇక్కడ చలిగా ఉంది’ అని అన్నాడు. ‘ఐతే ఓ పనిచేయి. నా హ్యాండ్‌ గ్రిప్‌ తీసుకుకొని రా’ అని చెప్పాను. ‘భలే మంచోడివే దొరికావు. ముందు నీళ్లు తాగు. తీసుకొస్తా’ అని వెళ్లాడు. ఈ రోజు మహీభాయ్‌ నాకు దొరికాడు అని సంతోషించా’ అని రైనా చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని