Virat Kohli: విరాట్ స్థానంపై ప్రశ్నించేవారంతా గల్లీ క్రికెటర్లే: పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు

టీ20 ప్రపంచ కప్‌ 2024 (T20 World CUp 2024) కోసం ఎంపిక చేసే జట్టులో విరాట్‌కు స్థానం కల్పిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Published : 14 Mar 2024 18:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జూన్ నుంచి టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. అమెరికా - విండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీలో జూన్ 9న భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. వరల్డ్‌ కప్‌ కోసం ప్రకటించే భారత జట్టు ఎలా ఉంటుందనే దానిపై ఇంతవరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. బీసీసీఐ కార్యదర్శి జై షా మాత్రం రోహిత్ నాయకత్వంలోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగుతుందని ఇప్పటికే వెల్లడించాడు. అయితే, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకుంటారా? యువకులకు అవకాశం ఇస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

కొందరేమో కోహ్లీని కొనసాగించాలని చెబుతుంటే.. మరికొందరు విశ్లేషకులు మాత్రం అతడిని పక్కన పెట్టేసి కుర్రాళ్లను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్ మహమ్మద్ ఇర్ఫాన్ కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ను తీసుకోవద్దని చెప్పేవారంతా గల్లీ క్రికెట్‌ ఆడిన వారేనని వ్యాఖ్యానించాడు. 

‘‘ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో విరాట్ టాప్‌ స్కోరర్. భారత్‌కు కొన్ని మ్యాచుల్లో ఒంటిచేత్తో విజయాలు అందించాడు. అందుకే కోహ్లీని వచ్చే టీ20 ప్రపంచ కప్‌లోనూ జట్టులోకి తీసుకోవాలి. టీమ్‌ఇండియాకు అతిపెద్ద ఆస్తి అతడు. జట్టుతోపాటు ఉంటే మానసికంగా భారత్‌ పైచేయి సాధిస్తుంది. కోహ్లీ స్థానంపై ప్రశ్నిస్తున్న కొందరు విశ్లేషకులు గల్లీ క్రికెట్‌ ఆడినవారై ఉంటారు. 

విమర్శలు చేసేవారంతా గత ప్రపంచ కప్‌ను గమనించాలి. భారత్ కష్టాల్లో పడినప్పుడు విరాట్ ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చాడు. లేకపోతే భారత్‌ లీగ్‌ స్టేజ్‌లోనే కనీసం 4 మ్యాచ్‌ల వరకు ఓడిపోయేది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి బలమైన జట్లపైనా టీమ్‌ఇండియా త్వరగా వికెట్లను చేజార్చుకుంది. కానీ, కోహ్లీ మ్యాచ్‌ను భారత్‌ వైపు మళ్లేలా చేయడంలో సక్సెస్‌ అయ్యాడు’’ అని మహమ్మద్‌ ఇర్ఫాన్‌ తెలిపాడు. వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 765 పరుగులు చేశాడు. అంతకుముందు పొట్టి కప్‌లోనూ పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని