Mirabai Chanu: మీరాబాయి చాను..  పతకాల డెడ్లీ కాంబినేషన్‌ ఇలా..!

మన హైదరాబాద్‌లో పావు వంతు జనాభా.. పర్వతాలు.. గుట్టలతో దుర్భేద్యమైన భూభాగం.. అత్యాధునిక సదుపాయాలు కనిపించవు.. కానీ, రెండు ఒలింపిక్‌ పతకాలు..! ఇదేలా సాధ్యమైందంటే.. ఒక్కటే సమాధానం..! క్రీడలు

Updated : 25 Jul 2021 12:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

మన హైదరాబాద్‌తో పోల్చితే పావు వంతు జనాభా.. పర్వతాలు.. గుట్టలతో దుర్భేద్యమైన భూభాగం.. అత్యాధునిక సదుపాయాలు కనిపించవు.. కానీ, మణిపూర్‌కు రెండు ఒలింపిక్‌ పతకాలు..! ఇదేలా సాధ్యమైందంటే.. ఒక్కటే సమాధానం..! క్రీడలు అనేవి మణిపూర్‌ వాసుల డీఎన్‌ఏలోనే ఉన్నాయి..! అక్కడి పర్వత ప్రాంతాలు.. వారి సంస్కృతి.. పుట్టుకతో వచ్చే జన్యువులు.. ఆహారపు అలవాట్ల నుంచి లభించే అడ్వాంటేజ్‌.. కఠిన పరిశ్రమ.. ఈ డెడ్లీ కాంబినేషన్‌ వారిని ఛాంపియన్లుగా మలుస్తోంది.

ఒలింపిక్స్‌ జరుగుతున్న ప్రతిసారి పతకాల పట్టికలో భారత్‌ స్థానం సాధించే వరకూ టెన్షనే. ఈ క్రీడలు ముగిసేలోపు మన అథ్లెట్లు కొన్ని పతకాలు సాధించి దేశం పేరు నిలబెట్టగానే ఊపిరి పీల్చుకుంటాము. ఈ సారి 140 కోట్ల మంది భారతీయులకు ఆ టెన్షన్‌ లేకుండా చేసింది మీరాబాయి సాయికోమ్‌ చాను. క్రీడలు ప్రారంభమైన రెండో రోజే వెండిపతకాన్ని సాధించి.. పతకాల పట్టికలో త్రివర్ణపతాకాన్ని ఎక్కించింది. తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరీ తర్వాత 21 ఏళ్లకు ఈ విభాగంలో పతకం సాధించిన మహిళగా నిలిచింది. చాను విజయం ఈశాన్య భారత్‌ వాసులు క్రీడల్లో అద్భుతంగా రాణించగలరని మరోసారి చాటి చెప్పింది.

అక్కడి జీవితాల్లో క్రీడలు ఓ భాగం..

మణిపూర్‌లో పిల్లలను క్రీడల్లో భాగస్వామం చేయడంలో అక్కడి స్పోర్ట్స్‌ క్లబ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ రాష్ట్ర సంస్కృతిలో అవి ఒక భాగం. ఈ క్లబ్‌లు ఏదో ఒక క్రీడకే పరిమితమైపోవు. ఇవి రాష్ట్ర, జాతీయ అసోసియేషన్లతో అనుసంధానమై కూడా ఉండవు. యువతను శారీరకంగా పటిష్ఠంగా ఉంచేందుకు.. క్రీడలపై ప్రేమతోనే వీటిని నిర్వహిస్తారు. మణిపూర్‌లో పిల్లలకు విద్యతోపాటు రెండో ఆప్షన్‌గా క్రీడలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.

చిన్నవయసులోనే..

ఒలింపిక్‌ పతకాల ఫ్యాక్టరీలుగా పేరున్న చైనా,అమెరికా, రష్యాల్లో పిల్లలకు చిన్నప్పటి నుంచే క్రీడల్లో శిక్షణ మొదలవుతుంది. వారు యవ్వనానికి వచ్చే సరికి ఆయా క్రీడల్లో ప్రపంచాన్ని శాసించడం మొదలు పెడతారు. మణిపూర్‌లో  పిల్లలు కూడా తమకు ఇష్టమైన క్రీడను ఎంపిక చేసుకొని ఆడే అవకాశం లభిస్తుంది. దీంతో వారు టీనేజీకి వచ్చేసరికి ఆ క్రీడలో నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటారు. అంతేకాదు.. నిత్యం సాధనతో లభించే శారీరక శ్రమ వారిలో క్రమశిక్షణను పెంచుతుంది. మీరాబాయి విషయమే తీసుకొంటే ఆమె 12ఏళ్ల నుంచే సాధన మొదలుపెట్టింది. శిక్షణ ఎంత కఠినంగా ఉన్నా.. చాను ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోచ్‌ చెప్పిన పని చేసేదని ఆమె శిక్షకురాలు అనితా చాను వెల్లడించారు. ఈ క్రమశిక్షణ ఫలితంగా అక్కడి వారు క్రీడల్లో ప్రొఫెషనల్‌ స్థాయికి చేరుకొంటున్నారు.

ఇక 1990ల్లో నుంచి క్రీడలను కూడా కెరీర్‌గా ఎంచుకోవచ్చు.. అన్న అవగాహన అక్కడి వారిలో బాగా పెరిగింది. ఆ తర్వాత స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కేంద్రాన్ని ఇంఫాల్‌లో ప్రారంభించారు. దీంతో ఆ రాష్ట్రం నుంచి మణిపూసల వంటి వెయిట్‌ లిఫ్టర్లు దేశానికి లభించారు. అథ్లెట్‌గా కెరీర్‌ ముగించిన వారు ప్రొఫెషనల్‌ కోచ్‌లుగా మారుతున్నారు. వీరు ప్రతిభావంతులను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 12 ఏళ్ల వయస్సులో చాను నిత్యం 44 కిలోమీటర్లు ప్రయాణించి ఇంఫాల్‌ వెళ్లి శిక్షణ తీసుకునేది. ఈ క్రమంలో మాజీ అంతర్జాతీయ వెయిట్‌ లిఫ్టర్‌ అనితా చాను దృష్టిని ఈమె ఆకట్టుకుంది. తర్వాత ఆమె శిక్షణలో రాటుదేలింది.

శారీరక నిర్మాణం..

మనిషి ఎత్తును బట్టి శరీరంలో గురుత్వాకర్షణ కేంద్రం ఉంటుంది. తక్కువ ఎత్తు, ఆరోగ్యవంతమైన బరువు ఉన్నవారిలోని గురత్వాకర్షణ కేంద్రం కొన్ని క్రీడల్లో అద్భుతమైన అడ్వాంటేజ్‌ ఇస్తుంది. ఇది మనిషిని స్థిరంగా ఉంచుతుంది. ఫుట్‌బాల్‌ మాంత్రికుడు మెస్సీ విజయంలో ఇది కీలక అంశమని ‘ది ఏబీసీ స్టడీ’ పేర్కొంది. డీగో మారడోనా కూడా ఎత్తు తక్కువగానే ఉంటారు. అలానే వెయిట్‌ లిఫ్టింగ్‌లో కూడా ఈ అంశం అద్భుతంగా పని చేస్తుంది. అందుకే స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో కలిపి తన బరువుకు దాదాపు నాలుగు రెట్లు మోసిందని అనితా చాను పేర్కొన్నారు. ఈశాన్య భారత్‌ వాసులు ఎత్తు తక్కువ ఉండటంతో ఇటువంటి క్రీడల్లో రాణించడానికి ఉపయోగపడుతోందని ఆమె వివరించారు. అంతేకాదు.. భౌగోళిక పరిస్థితులు.. ఆహారపు అలవాట్లు వారిని మరింత ధృడంగా మార్చేశాయన్నారు.

అన్నంతో అదనపు బలం..!

తేలిగ్గా జీర్ణమై.. వేగంగా శక్తిని విడుదల చేసే ఆహారం వెయిట్‌ లిఫ్టర్లకు ఓ వరం. సాధారణంగా శరీరానికి లభించే కార్బోహైడ్రెట్లే ప్రధాన శక్తి వనరు. మణిపూర్‌ వాసుల ప్రధాన ఆహారం వరి అన్నం. గోధుమలతో పోలిస్తే ఇది తేలిగ్గా జీర్ణమై వెంటనే శక్తినిస్తుంది. వేగంగా శరీరానికి అందే శక్తి.. కఠిన సాధన ఇక్కడి వెయిట్‌ లిఫ్టర్లను ఛాంపియన్లుగా మలుస్తోందని మణిపూర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ సెక్రటరీ సునీల్‌ ఎలాంగ్‌బామ్‌ పేర్కొన్నారు. తక్కువ వెయిట్‌ విభాగంలో ప్రపంచ స్థాయి అథ్లెట్లను తయారు చేసే చైనా, దక్షిణ కొరియాల్లో కూడా జిగురుగా ఉండే వరి అన్నమే ప్రధాన ఆహారం కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని