పిట్ట రాలేదు.. మొక్క మొలవలేదు!

శబ్ద కాలుష్యం మనుషుల మీదే కాదు. వృక్ష జీవ వైవిధ్యం పైనా విపరీత ప్రభావం చూపుతోంది. శబ్ద కాలుష్య కారకాలు తొలగిపోయిన తర్వాతా వాటి ప్రభావం అలాగే కొనసాగుతూ వస్తుండటం ఆందోళనకరం.

Updated : 02 Jun 2021 04:38 IST

శబ్ద కాలుష్యం మనుషుల మీదే కాదు. వృక్ష జీవ వైవిధ్యం పైనా విపరీత ప్రభావం చూపుతోంది. శబ్ద కాలుష్య కారకాలు తొలగిపోయిన తర్వాతా వాటి ప్రభావం అలాగే కొనసాగుతూ వస్తుండటం ఆందోళనకరం. కాలిఫోర్నియా పాలిటెక్నిక్‌ స్టేట్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనం ఈ విషయాన్నే నొక్కి చెబుతోంది. మెక్సికోలోని సహజ వాయు బావుల వద్ద పరిశోధకులు ఇటీవల ఒక విచిత్రమైన విషయాన్ని గుర్తించారు. సాధారణంగా సహజ వాయువును వెలికి తీయటానికి ఇక్కడ పెద్ద పెద్ద శబ్దాలు చేసే కంప్రెసర్లను ఉపయోగిస్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పిన్యాన్‌ రకం పైన్‌ మొక్కలు 75% తక్కువ ఉండటం ఆశ్చర్యం కలిగించింది. దీనికి కారణమేంటని ఆరా తీయగా కంప్రెసర్ల నుంచి వెలువడే భారీ శబ్దాలు వుడ్‌హౌసెస్‌ స్క్రబ్‌ జే పక్షులను బెదర గొట్టటమేనని బయటపడింది. ఈ పక్షులు చలికాలంలో ఆహారం కోసం పైన్‌ విత్తనాల్ని వేల సంఖ్యలో భూమిలో దాచిపెట్టుకుంటాయి. ఇవే తదనంతర కాలంలో మొలకెత్తి, చెట్లవుతాయి. పక్షులే రాకపోతే మొక్కలెలా మొలుస్తాయి? చెట్లు ఎక్కడ్నుంచి వస్తాయి? మరో ముఖ్య విషయం ఏంటంటే- సహజ వాయు కంపెనీ పనులను పూర్తిగా ఆపేసి, అక్కడ్నుంచి తరలిపోయినా పైన్‌ మొక్కల సంఖ్య పెరగలేదు. అంటే నిశ్శబ్ద వాతావరణం నెలకొన్న తర్వాతా వుడ్‌హౌసెస్‌ పక్షులు అటువైపు రాలేదన్నమాట. ఆ చప్పుళ్లు వాటి మనసుల్ని అంతగా బాధించాయి మరి. ధ్వని కాలుష్యం అటవీ సమూహాలనూ తీవ్రంగా ప్రభావితం చేస్తోందనటానికిదే సాక్ష్యమని పరిశోధకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని