AI Carpenter Tool: కృత్రిమ వడ్రంగి!

కొన్ని చెక్క కుర్చీలు, బల్లల డిజైన్లు చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంటుంది. అలాంటివే తయారు చేసుకోవాలనే కోరికా కలుగుతుంది. ఫోటోలూ తీసుకుంటాం. వీటి సాయంతో కొత్తవి చేయిస్తే అలాంటి రూపం రావటం కష్టం. ఇలాంటి ఇబ్బందిని తప్పించటానికే

Updated : 11 Aug 2021 16:37 IST

కొన్ని చెక్క కుర్చీలు, బల్లల డిజైన్లు చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంటుంది. అలాంటివే తయారు చేసుకోవాలనే కోరికా కలుగుతుంది. ఫోటోలూ తీసుకుంటాం. వీటి సాయంతో కొత్తవి చేయిస్తే అలాంటి రూపం రావటం కష్టం. ఇలాంటి ఇబ్బందిని తప్పించటానికే యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన జేమ్స్‌ నికెల్‌ సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) సాధనాన్ని రూపొందించారు. ఇది చెక్క ఫర్నిచర్‌ ఫొటోలను స్పష్టమైన 3డీ నమూనాలుగా మార్చేస్తుంది. వీటి సాయంతో నైపుణ్యం గల వడ్రంగులెవరైనా వాటి నకళ్లను ఇట్టే సృష్టించొచ్చు. ఫర్నిచర్‌ వంటి వస్తువుల 3డీ నమూనాలను రూపొందించే ఆల్గోరిథమ్‌లతో చిక్కేంటంటే వీటిల్లో తగినంత సమాచారం ఉండదు. వివరాలు సమగ్రంగా ఉండవు. అందువల్ల ఫర్నిచర్‌ నకళ్లను సరిగ్గా తయారుచేయటం సాధ్యం కాదు. దీన్ని అధిగమించటానికే జామెట్రిక్‌ ఆప్టిమైజేషన్‌ పద్ధతుల సాయంతో ఫర్నిచర్‌ను కొలతలతో సహా భాగాలుగా విడదీసి, అనంతరం వాటిని కలిపేసే ఆల్గోరిథమ్‌ను తీర్చిదిద్దారు. ఇది ఆయా భాగాల కొలతలను కచ్చితంగా గ్రహిస్తుండటం విశేషం. దీని కోసం ఫర్నిచర్‌ను అన్ని వైపుల నుంచి ఫొటోలు తీయాల్సిన అవసరమూ ఉండదు. ఏదో ఒకవైపు నుంచి తీసినా చాలు. స్మార్ట్‌ఫోన్‌తో తీసిన చెక్క వస్తువుల ఫొటోలైనా సరే. ఇది కంప్యూటర్‌లో 10 నిమిషాల్లోనే 3డీ నమూనాను సిద్ధం చేసి పెడుతుంది. ఫర్నిచర్‌ భాగాలను కొలతల వారీగా ముందుంచుతుంది. మున్ముందు దీన్ని నేరుగా ఫోన్‌లోనే పనిచేసేలా తీర్చిదిద్దాలనీ భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని