Apple Lockdown Mode: స్పైవేర్‌కు చెక్‌ పెట్టేందుకు యాపిల్ లాక్‌డౌన్‌ మోడ్‌

గత కొంత కాలంగా కొంత మంది వ్యక్తులు, సంస్థలు యాపిల్‌ యూజర్లు లక్ష్యంగా సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన యాపిల్ సంస్థ యూజర్ల కోసం పటిష్టమైన భద్రతా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది...

Updated : 09 Jul 2022 12:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్ కంపెనీ వ్యక్తిగత గోప్యతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. కానీ, కొంత మంది వ్యక్తులు, సంస్థలు యాపిల్‌ యూజర్లు లక్ష్యంగా సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన యాపిల్ సంస్థ యూజర్ల కోసం పటిష్ఠమైన భద్రతా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సెప్టెంబరులో విడుదలకానున్న ఐఓఎస్‌ 16, ఐపాడ్‌ఓఎస్ 16, మాక్‌ఓఎస్‌ వెంచురాలో ఈ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. లాక్‌డౌన్‌ మోడ్‌ (Lockdown Mode) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ సైబర్‌దాడుల నుంచి ఐఫోన్‌, ఐపాడ్‌, మ్యాక్‌ కంప్యూటర్లలోని యూజర్ల డేటాకు రక్షణ కవచంలా పనిచేస్తుందని యాపిల్ కంపెనీ తెలిపింది.  

యూజర్లు తమ డివైజ్‌లలో లాక్‌డౌన్‌ మోడ్‌ ఎనేబుల్ చేసిన తర్వాత మెసేజ్‌లు, వెబ్‌ బ్రౌజింగ్‌, యాపిల్‌ సేవలు వంటి వాటితోపాటు, ఇతరత్రా సర్వీసుల ద్వారా జరిగే సైబర్‌ దాడుల నుంచి పూర్తి రక్షణ ఉంటుందని యాపిల్‌ ధీమా వ్యక్తం చేసింది. కొద్దిరోజుల క్రితం ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అభివృద్ధి చేసిన స్పైవేర్‌ హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్‌తో ఐఫోన్లు, యాపిల్‌ డివైజ్‌లపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూజర్ల గోప్యతకు భంగం కలిగించే నిఘా సాఫ్ట్‌వేర్‌లకు చెక్ పెట్టేందుకు యాపిల్ లాక్‌డౌన్‌ మోడ్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఎంపిక చేసిన కొద్ది మంది యూజర్లతో పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక ఇందులోని లోపాలను కనుగొన్న బగ్‌ బౌంటీస్‌కు అత్యధికంగా రెండు మిలియన్‌ డాలర్లు పారితోషికం అందిస్తామని యాపిల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబరులో విడుదలయ్యే ఐఓఎస్‌ 16 ఓఎస్‌తో యూజర్లు తమ డివైజ్‌లలో ఈ ఫీచర్‌ను పొందొచ్చు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని