గోప్యత గోప్యంగా..

మన వ్యక్తిగత వివరాలు ఆన్‌లైన్‌లో చోరీ అవుతున్నాయా? పెగాసస్‌ హ్యాకింగ్‌ వివాదం అనంతరం అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. మన సమాచారం చోరీ అయ్యిందో లేదో కచ్చితంగా తెలియదు గానీ దీనికి ముప్పు పొంచి ఉన్న మాట మాత్రం ...

Published : 01 Sep 2021 01:00 IST

మన వ్యక్తిగత వివరాలు ఆన్‌లైన్‌లో చోరీ అవుతున్నాయా? పెగాసస్‌ హ్యాకింగ్‌ వివాదం అనంతరం అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. మన సమాచారం చోరీ అయ్యిందో లేదో కచ్చితంగా తెలియదు గానీ దీనికి ముప్పు పొంచి ఉన్న మాట మాత్రం నిజం. బడా కార్పొరేట్‌ సంస్థలు, టెక్‌ కంపెనీలు సమాచారాన్ని సేకరిస్తుండమే దీనికి కారణం. మరి వీరి ‘కంట’ పడకుండా తప్పించుకోవటమెలా?

ప్పుడు మనం వాస్తవ ప్రపంచంలో కన్నా ఆన్‌లైన్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం. ఈమెయిళ్ల దగ్గర్నుంచి, ఛాటింగ్‌, షాపింగ్‌ వరకూ అన్నీ ఇందులోనే చేసేస్తున్నాం. ఇది మనకు సౌకర్యంగానే ఉండొచ్చు గానీ వ్యక్తిగత వివరాలు ఇతరుల చేతికి చిక్కే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే బడా కార్పొరేషన్లు, టెక్‌ సంస్థలు ఆన్‌లైన్‌లో నిరంతరం మన వ్యవహారాలను ఓ కంట కనిపెడుతుంటాయి. మనకు ఇష్టమైన సేవలు, వస్తువుల గురించి తెలుసుకుంటూ ఉంటాయి. అనంతరం వాటిని మనకు అమ్మటానికి ఆహ్వానాలు పంపుతుంటాయి. ఇలా ప్రకటనల కోసం ఖర్చు పెట్టాల్సిన పనిలేకుండా కోట్లాది రూపాయలను ఆదా చేసుకుంటాయి. మన ఆసక్తులను బట్టి వీటి ఆహ్వానాలూ మారుతూ వస్తుంటాయి. చవక వస్తువులకు బదులు ఖరీదైన వాటి కోసం వెతుకుతున్నామనుకోండి. అలాంటివే అందించటానికి ఉవ్విళ్లూరుతుంటాయి. ఆయా వస్తువుల పట్ల మనం ఎంత సంతృప్తి చెందుతున్నామనేది తెలుసుకోవటానికి టూల్స్‌నూ రూపొందిస్తాయి. వీటితో కంపెనీలకు మరో పెద్ద ప్రయోజనం రిస్క్‌లను తప్పించుకోవటం. మన అవసరాలను బట్టి కావాల్సిన వస్తువులనే తయారు చేయటం వల్ల ఖర్చు, కాలం రెండూ ఆదా అవుతాయి. టెక్‌ కంపెనీలను మన సమాచారాన్ని సేకరించి సప్లయర్‌ నెట్‌వర్క్‌లకు అమ్ముతాయి. ఇవి మన ప్రవర్తన ఆధారంగా మనకు ఉపయోగపడే వస్తువులను తయారుచేస్తాయి.

ఎలాంటి సమాచారం సేకరిస్తారు?
కంపెనీలు చాలావరకు మన పేరు, ఈమెయిల్‌ చిరునామా, నివాస ప్రాంతం వంటి వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవటానికే ఇష్టపడతాయి. ఐపీ అడ్రస్‌, బ్రౌజింగ్‌ కోసం వాడుతున్న పరికరాలు, ఏమేం బ్రౌజ్‌ చేస్తున్నారు, తేదీ, సమయం, రిక్వెస్ట్‌ల యూఆర్‌ఎల్‌, వాడుతున్న యాప్‌ల మధ్య ఇంటరాక్షన్‌ వంటివి తెలుసుకోవాలనీ ఉబలాట పడతాయి. బ్రౌజింగ్‌ హిస్టరీ, చూసిన ప్రకటనలు, ప్రకటనలకు స్పందిస్తున్న తీరు, తేదీ, ఆన్‌లైన్‌లో గడుపుతున్న సమయం కూడా ముఖ్యమే. వైఫై యాక్సెస్‌ పాయింట్‌, బ్లూటూత్‌ కనెక్షన్‌, జీపీఎస్‌ పొజిషనింగ్‌ వంటి వాటి ద్వారా నివాస ప్రాంతాన్నీ తెలుసుకుంటాయి.

వీటిని ఓడించటమెలా?
మనం మనుషులం. మన సమాచారాన్ని సేకరించేవి కంప్యూటర్లు. అందువల్ల మనం వాటిని ఓడించటం సాధ్యమే. ఇందుకు కొన్ని జాగ్రత్తలు ఉపయోగపడతాయి. వీటిలో డేటాను పక్కదారి పట్టించటం ఒకటి. దీన్నే డేటా పాయిజనింగ్‌ అనుకోవచ్చు. సాధారణంగా మనం చేయని పనులను చేయటం, మనకు ఇష్టంలేని వస్తువుల మీద ఆసక్తి చూపటం వంటి చర్యలతో సమాచారం సేకరించే కంప్యూటర్లను బురిడీ కొట్టించొచ్చు. డేటా సమ్మెనూ ఉపయోగించుకోవచ్చు. అంటే మన సమాచారాన్ని ఇవ్వకుండా పక్కన పెట్టేయొచ్చు. లేదూ ఇప్పటికే ఇచ్చిన వివరాలను డిలీట్‌ చేయొచ్చు. మన సమాచారాన్ని తీసుకోనీయకుండా ప్రైవసీ టూల్స్‌ను వాడుకోవచ్చు. ఫేస్‌బుక్‌ వంటి వెబ్‌సైట్లు థర్డ్‌ పార్టీలతో పంచుకున్న సమాచారాన్ని మార్చుకోవటానికి వీలు కల్పిస్తున్నాయి. సమాచారాన్ని ఎంతవరకు, ఎప్పుడెప్పుడు సేకరించటానికి అనుమతి ఇవ్వాలనేది ప్రైవసీ సెటింగ్స్‌ ద్వారా అడ్జస్ట్‌ చేసుకోవచ్చు.

* చాలామంది వ్యక్తిగత సమాచారాన్ని సేకరించటానికి గూగుల్‌ ముఖ్య కేంద్రం. ఎక్కువ మంది వాడేది ఇదే. ప్రకటనల సెర్చ్‌ల నుంచి మన పేరు తొలగించుకోవటం ద్వారా కొంతవరకు కాపాడుకోవచ్చు. ఇందుకు గూగుల్‌ యాక్టివిటీస్‌లోకి వెళ్లి యాడ్‌ పర్సనలైజేషన్‌, యూట్యూబ్‌ హిస్టరీ, యాప్‌, వెబ్‌ యాక్టివిటీలను మేనేజ్‌ చేసుకోవటం బాగా ఉపయోగపడుతుంది. మేనేజ్‌ యువర్‌ యాక్టివిటీ కంట్రోల్స్‌లో ఆటో డిలీట్‌ను టర్న్‌ ఆన్‌ చేసుకుంటే తరచూ డేటా దానంతటదే తొలగిపోతుంది.

* మన వ్యక్తిగత అనుభవాలను తెలుసుకోవటానికి చాలా వెబ్‌సైట్లు కుకీస్‌ను ఉపయోగించుకుంటుంటాయి. వెబ్‌సైట్‌లోకి వెళ్లటానికి యథాలాపంగా కుకీస్‌ను యాక్సెప్ట్‌ చేస్తుంటాం. కానీ దీంతో మన వ్యవహారాలను థర్డ్‌ పార్టీలతో పంచుకోవటానికీ అనుమతిస్తున్నామనే సంగతి చాలామందికి తెలియదు. ఒక వెబ్‌సైట్‌ నుంచి మరో వెబ్‌సైట్‌ వరకు మన వ్యవహారాలు వీటి ద్వారానే తెలుస్తాయి. బ్రౌజర్‌ సెటింగ్స్‌లోకి వెళ్లి కుకీస్‌ను టర్న్‌ ఆఫ్‌ చేసుకుంటే వీటి బెడద నుంచి తప్పించుకోవచ్చు.

* కావాలనుకుంటే మరింత త్రీవమైన చర్య తీసుకోవచ్చు. అది ఆయా వెబ్‌సైట్ల సేవల నుంచి పూర్తిగా వైదొలగటం. అప్పుడు కంపెనీలు మనల్ని ఏమీ చేయలేవు. కాకపోతే ముందుగా మన ఖాతాలను పూర్తిగా డిలీట్‌ చేయాలి. ఇందుకోసం JustDeleteMe ని ఉపయోగించుకోవచ్చు. ఇది డైరెక్ట్‌ లింకుల డైరెక్టరీ. వందలాది వెబ్‌ సర్వీసుల నుంచి మన ఖాతాలను ఇట్టే తొలగించేస్తుంది. ఖాతాను తొలగించుకోవటానికి అనుమతించే వెబ్‌ సర్వీస్‌ పేజీని నేరుగా చేరుకోవటానికి జస్ట్‌డిలీట్‌మీ ఉపయోగపడుతుంది. https://justdeleteme.xyz ద్వారా దీన్ని వాడుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని