భూమి నీటిని చంద్రుడు కాజేస్తున్నాడా?

నీటి జాడలున్నాయి. అయినా సహారా ఎడారి కన్నా 100 రెట్లు అధికంగా పొడిగా ఉంటుంది. ఇంతటి చిత్రం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? చంద్రుడి మీద. జాబిల్లి మీద నీరు గురించి మనకు మొదట్నుంచీ ఆసక్తే. తొలితరం ఖగోళ శాస్త్రవేత్తలు చంద్రుడి మీది మచ్చలను

Updated : 11 May 2022 10:37 IST

నీటి జాడలున్నాయి. అయినా సహారా ఎడారి కన్నా 100 రెట్లు అధికంగా పొడిగా ఉంటుంది. ఇంతటి చిత్రం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? చంద్రుడి మీద. జాబిల్లి మీద నీరు గురించి మనకు మొదట్నుంచీ ఆసక్తే. తొలితరం ఖగోళ శాస్త్రవేత్తలు చంద్రుడి మీది మచ్చలను సముద్రాలుగానే భావించేవారు. తర్వాత అక్కడ వాతావరణమే లేదని, ఉపరితలం మీద ఎక్కడైనా నీరుంటే అది వెంటనే ఆవిరైపోతుందని తేల్చారు. అపోలో వ్యోమనౌక ద్వారా చంద్రుడి మీద కాలుపెట్టి, అక్కడ్నుంచి తెచ్చిన నమూనాలను పరిశీలించినా నీటి ఆనవాళ్లేమీ కనిపించలేదు. అనంతరం జాబిల్లి ఖనిజాలను విశ్లేషించి  శాశ్వతంగా చీకటిగా ఉండే భాగంలో మంచు ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. మన ఇస్రోకు చెందిన చంద్రయాన్‌-1, నాసాకు చెందిన కాసిని, డీప్‌ ఇంపాక్ట్‌ ప్రయోగాల్లో ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ అణువుల రూపంలో తడి ఖనిజాలు ఉన్నట్టు బయటపడింది. చివరికి నాసాకు చెందిన సోఫియా ప్రయోగం అందించిన సమాచారాన్ని విశ్లేషించి చంద్రుడి మీద నీరుందని నిర్ధరించారు. నీటి అణువులు చంద్రుడి ధూళి రేణువుల్లో చిక్కుకొని ఉండచ్చని తేల్చారు. దీనికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. చంద్రుడి మీదున్న నీరంతా అక్కడిదే కాదని, కొంత నీరు భూ వాతావరణం నుంచి ‘కొల్లగొట్టిందే’నని యూనివర్సిటీ ఆఫ్‌ అలస్కా ఫెయిర్‌బ్యాంక్స్‌ (యూఏఎఫ్‌) శాస్త్రవేత్తలు తాజాగా పేర్కొంటున్నారు.

భూఅయస్కాంతావరణంతో..

భూమి పై వాతావరణం నుంచి హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ అయాన్లు అంతరిక్షంలోకి వెళ్లిపోతుంటాయి. ఇవి చంద్రుడి మీద కలిసిపోయి నీరుగా ఏర్పడి ఉండొచ్చన్నది యూఏఎఫ్‌ శాస్త్రవేత్తల భావన. ఈ నీరు చంద్రుడి ధ్రువాల వద్ద ఉపరితలం కింద 3,500 క్యూబిక్‌ కిలోమీటర్ల విస్తీర్ణంలో గడ్డకట్టి లేదా ద్రవరూపంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భూమి అయస్కాంత గుణం ఉంటుంది కదా. దీని ప్రభావంతో నెలలో ఐదు రోజుల పాటు భూమి చుట్టూ బుడగ మాదిరిగా భూఅయస్కాంతావరణం ఏర్పడుతుంది. సూర్యుడి నుంచి వీచే సౌర గాలి నెట్టటం వల్ల ఇందులో కొంత భాగం చిట్లిపోతుంది. అప్పుడది భూమికి ఒక చివరన అంటుకొని తోకలాగా మారుతుంది. దీన్ని చంద్రుడు తాకినప్పుడు చిట్లిపోయిన భాగాల్లో కొన్ని తిరిగి అతుక్కుంటాయి. దీంతో భూ వాతావరణం నుంచి తప్పించుకున్న హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ అయాన్లు హఠాత్తుగా తిరిగి వెనక్కి వస్తుంటాయి. ఈ క్రమంలో అయాన్లు చంద్రుడి ఉపరితలం మీద పడతాయి. అంటే అప్పుడు చంద్రుడు హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ అయాన్ల ముసురులో చిక్కుకొని ఉంటాడని అనుకోవచ్చు. చంద్రుడికి అయస్కాంతావరణం ఉండదు కాబట్టి ఈ అయాన్లు చంద్రుడి ఉపరితలంలోకి చొచ్చుకెళ్లి, మంచు రూపంలో స్థిరపడతాయని యూఏఎఫ్‌ భూభౌతిక శాస్త్రవేత్త గంథర్‌ క్లెటెట్‌చ్కా చెబుతున్నారు.

ఇతర కారణాలూ

చంద్రుడి మీద నీరు పోగుపడటానికి ఇదొక్కటే కారణం కాదు. సుమారు 350 కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలాలు, తోకచుక్కలు ఢీకొట్టినప్పుడు పుట్టుకొచ్చి ఉండొచ్చని కొన్ని భావనలు చెబుతున్నాయి. సౌరగాలులు కూడా నీటి వనరులుగా ఉపయోగపడి ఉండొచ్చు. సౌరగాలుల్లో ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ అయాన్లు ఉంటాయి. ఇవి కలిసిపోయి నీటి అణువులుగా ఏర్పడి ఉండొచ్చు. ఎక్కడ్నుంచి వస్తేనేం? మొత్తమ్మీద చంద్రుడి మీద నీరుందనే విషయం స్పష్టమైంది. త్వరలో అక్కడ దక్షిణ ధ్రువం వద్ద ఆవాసాలు నిర్మించాలని భావిస్తున్న శాస్త్రవేత్తల బృందానికిది తీపి కబురే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని