ప్రైవసీని పదిలం చేస్తాయి..

ఒక్కసారి నెట్టింట్లో అడుగు పెడితే చాలు. మీరు చేస్తున్న బ్రౌజింగ్‌ని ఆయా బ్రౌజర్లు నిత్యం మానిటర్‌ చేస్తుంటాయి. డేటాని కలెక్ట్‌ చేస్తుంటాయి. ఇలా జరగొద్దనుకుంటే..

Updated : 04 Apr 2021 20:47 IST

ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌లో ప్రైవేటు బ్రౌజింగ్‌

ఒక్కసారి నెట్టింట్లో అడుగు పెడితే చాలు. మీరు చేస్తున్న బ్రౌజింగ్‌ని ఆయా బ్రౌజర్లు నిత్యం మానిటర్‌ చేస్తుంటాయి. డేటాని కలెక్ట్‌ చేస్తుంటాయి. ఇలా జరగొద్దనుకుంటే.. ప్రైవసీని పదిలం చేసే బ్రౌజర్‌ యాప్‌లను వాడడం మంచిది. అలాంటివి ఏమున్నాయి? ఇవిగోండి కొన్ని.. వీటిల్లో కొన్ని ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీ నుంచి వచ్చినవి అయితే.. మరికొన్ని ఎక్కువగా ఆదరణ పొందినవి. ప్రయత్నిస్తే మీ వెబ్‌ విహారంగా ప్రైవేలుగానే సాగుతుంది..

‘ఫోకస్‌’ పెడతుంది..

ఫైర్‌ఫాక్స్‌ ఫోకస్‌: మోజిల్లా రూపొందించిన ఓపెన్‌సోర్స్‌ బ్రౌజర్‌ ఇది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు ప్రైవసీ-ఫోకస్డ్‌ వెబ్‌-బ్రౌజర్‌గా దీన్ని వాడుకోవచ్చు. ఉచితంగా దీంట్లోని అన్ని బిల్ట్‌-ఇన్‌ సౌకర్యాల్ని వాడుకోవచ్చు. యాడ్‌బ్లాకర్‌, ట్రాకింగ్‌ ప్రొటెక్షన్‌, కంటెంట్‌ బ్లాకింగ్‌.. సేవలతో మీ గోప్యతని మెరుగుపరుస్తుంది. సాధారణ బ్రౌజర్‌లలో ఇన్‌కగ్నిటో మోడ్‌ని అవసరం అయినప్పుడే వాడతాం. కానీ, ఫైర్‌ఫాక్స్‌ ఫోకస్‌లో మాత్రం డీఫాల్ట్‌గా ఇన్‌కగ్నిటో మోడ్‌ ఉంటుంది. అంటే.. మీరు ఏది ఓపెన్‌ చేసినా ప్రైవేటుగానే ట్యాబ్‌ల్లో దర్శనమిస్తాయి. ఆటోమేటిక్‌గానే వెబ్‌ ట్రాకర్స్‌ని నియంత్రించడంతో పాటు బ్రౌజింగ్‌ హిస్టరీని ఎప్పటికప్పుడు తుడిచిపెడుతుంది. బ్రౌజర్‌ని నుంచి ఒక్కసారి బయటికి వస్తే చాలు.. అన్నీ తొలగిపోతాయన్నమాట. అయితే, ఎలాండి యాడ్‌-ఆన్స్‌ని దీంట్లో జత చేసుకుని వాడుకునేందుకు అవకాశం లేదు. అలాగే, డార్క్‌మోడ్‌ కూడా ఎక్కడా కనిపించదు. 
డౌన్‌లోడ్‌ లింక్‌: https://bit.ly/31ejO8Q

‘టోర్‌’ని ప్రయత్నించారా?

Tor Browser: అన్ని డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌లలోనే కాకుండా స్మార్ట్‌ ఫోన్‌లోనూ వెబ్‌ విహారాన్ని సురక్షితం చేసుకునేందుకు ఎక్కువ మంది వాడుతున్న బ్రౌజర్‌ ఇది. ఒక రకంగా ఇది కూడా ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీ నుంచి ఇచ్చినదే. ఫైర్‌ఫాక్స్‌ మాదిరిగానే పని చేసినప్పటికీ.. మొత్తం ట్రాఫిక్‌ బిల్ట్‌-ఇన్‌ టోర్‌ నెట్‌వర్క్‌లోనే సాగుతుంది. దీంతో నెటిజన్‌గా మీ ఉనికిని హ్యాకర్లు పసిగట్టడడం సాధ్యం కాదు. ‘మల్టీ-లేయర్డ్‌ ఎన్‌క్రిప్షన్‌’లోనే వెబ్‌ విహారం సాగుతుంది. వెబ్‌ పేజీలు కాస్త నెమ్మదిగా ఓపెన్‌ అయినప్పటికీ.. ప్రైవసీని కోరుకునేవారు టోర్‌ని ప్రయత్నించొచ్చు. 
డౌన్‌లోడ్‌ లింక్‌: https://bit.ly/3vXn3j0

అన్నింటి కలగలుపు..

DuckDuckGo: మోడ్రన్‌ మొబైల్‌ బ్రౌజర్‌గా దీన్ని పిలుస్తున్నారు. ట్యాబ్‌లు, బుక్‌మార్క్‌లు, డార్క్‌మోడ్‌.. లాంటి మరిన్ని ఆప్షన్లతో పని చేస్తుంది. అంతేకాదు.. ప్రైవసీని పదిలం చేసుకునేందుకు తగిన ప్రత్యేక ఆప్షన్లు కూడా ఉన్నాయి. మొత్తం బ్రౌజింగ్‌ హిస్టరీని సింగిల్‌ ట్యాప్‌తో డిలీట్‌ చేయొచ్చు. నక్కి ఉండే థర్డ్‌ పార్టీ ట్రాకర్స్‌ని ఆటోమేటిక్‌గా బ్లాక్‌ చేస్తుంది. ‘గ్లోబల్‌ ప్రైవసీ కంట్రోల్‌’ పాలసీతో ఇది నెటిజన్లను అప్రమత్తం చేస్తుంది. 
డౌన్‌లోడ్‌ లింక్‌: https://bit.ly/3lKLyeC

‘యాడ్స్‌’ని నియంత్రిస్తుంది

 Adblock Browser: ఏ వెబ్‌ పేజీ ఓపెన్‌ చేసినా.. ఒకటే ప్రకటనలు. పాప్‌-అప్స్‌ రూపంలో వచ్చేవి కొన్నయితే.. వీడియో యాడ్స్‌లా కనిపించేవి ఇంకొన్ని. ఇలా వెబ్‌ విహారంలో పొడుచుకొచ్చే వాటిని బ్లాక్‌ చేసేందుకు అనువైన బ్రౌజర్‌. అంతేకాదు.. ‘గోస్ట్‌మోడ్‌’ని ఎంచుకుని బ్రౌజింగ్‌ హిస్టరీ, కుకీస్‌, టెంపరరీ ఫైల్స్‌ని బ్రౌజర్‌లో స్టోర్‌ అవ్వకుండా జాగ్రత్త పడొచ్చు. 
డౌన్‌లోడ్‌ లింక్‌: https://bit.ly/3ch8wao

‘బ్రేవ్‌’గా సాగిపోండి..

Brave Browse: ఇదో ఓపెన్‌సోర్స్‌ బ్రౌజర్‌. తక్కువ మెమొరీతో క్షణాల్లో ఫోన్‌లో ఒదిగిపోయి పని చేస్తుంది. ఎలాంటి పాప్‌-అప్‌లు, యాడ్‌లు, ఇతర మాల్వేర్‌లు వెబ్‌ విహారాన్ని పసిగట్టకుండా జాగ్రత్త పడుతుంది. వెబ్‌ పేజీలను వేగం ఓపెన్‌ చేస్తూ.. ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ని ఆదా చేస్తుంది. అంతేకాదు.. మొబైల్‌ డేటా కూడా ఎక్కువగా ఖర్చవకుండా చూస్తుంది.

డౌన్‌లోడ్‌ లింక్‌: https://bit.ly/3sltiLm

యాంటీవైరస్‌లా సురక్షితం..

Avast Secure Browser: ఫోన్‌ని సురక్షితం చేసుకోవడానికి యాంటీవైరస్‌ ఎలా వాడతామో.. బ్రౌజింగ్‌లో గోప్యతని పాంటించేందుకు ప్రైవేటు బ్రౌజర్‌ని వాడుతాం. అందుకే ఈ సెక్యూర్డ్‌ బ్రౌజర్‌. పబ్లిక్‌ వై-ఫైని వాడుకునే క్రమంలో వర్చువల్‌ ప్రైవేటు నెట్‌వర్క్‌ని (వీపీఎస్‌) క్రియేట్‌ చేసుకుని వెబ్‌లో విహరించొచ్చు. బిల్ట్‌-ఇన్‌ యాడ్‌-బ్లాకర్‌తో ప్రకటనలు, వెబ్‌-ట్రాకర్స్‌ని అడ్డుకోవచ్చు. ప్రైవేటు సెర్చింజన్‌లతో వెతుకులాట సాగించొచ్చు. 

డౌన్‌లోడ్‌ లింక్‌: https://bit.ly/3f6K2lW

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని