ఆండ్రాయిడ్‌లో టోల్‌ ఫ్రాడ్‌!

ఆన్‌లైన్‌లో ఎస్‌ఎంఎస్‌, కాల్‌ మోసాలు సరేసరి. ఇప్పుడు కొత్తగా టోల్‌ మోసాలూ మొదలయ్యాయి. ఆండ్రాయిడ్‌లో ‘టోల్‌ ఫ్రాడ్‌’ అనే మాల్వేర్‌ చక్కర్లు కొడుతోందని, దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్‌ సంస్థ హెచ్చరిస్తోంది మరి

Published : 06 Jul 2022 00:42 IST

ఆన్‌లైన్‌లో ఎస్‌ఎంఎస్‌, కాల్‌ మోసాలు సరేసరి. ఇప్పుడు కొత్తగా టోల్‌ మోసాలూ మొదలయ్యాయి. ఆండ్రాయిడ్‌లో ‘టోల్‌ ఫ్రాడ్‌’ అనే మాల్వేర్‌ చక్కర్లు కొడుతోందని, దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్‌ సంస్థ హెచ్చరిస్తోంది మరి. ఇది వై-ఫై కనెక్షన్‌ను స్విచాఫ్‌ చేయటం ద్వారా మొబైల్‌ వాలెట్‌ను ఖాళీ చేస్తుంది. సాధారణంగా ఎస్‌ఎంఎస్‌, కాల్‌ ఫ్రాడ్‌లో మెసేజ్‌ పంపటం, ప్రీమియం నంబరుకు ఫోన్‌ చేయించటంతో మోసాలకు పాల్పడుతుంటారు. వీటితో పోలిస్తే టోల్‌ ఫ్రాడ్‌ సంక్టిష్టమైన మోసమని చెప్పుకోవచ్చు. ఇది పలు అంచెలతో కూడుకొని ఉంటుంది. ఆయా నెట్‌వర్క్‌ల చందాదారులనే లక్ష్యంగా చేసుకుంటుంది. తర్వాత డిఫాల్ట్‌గా మొబైల్‌ కనెక్షన్‌ను తన పనులకు ఉపయోగించుకుంటుంది. వై-ఫై కనెక్షన్‌ అందుబాటులో ఉన్నప్పటికీ బలవంతంగా మొబైల్‌ నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయ్యేలా చేస్తుంది. ఒకసారి కనెక్ట్‌ కాగానే మన అనుమతి లేకుండానే తప్పుడు సబ్‌స్క్రిప్షన్లు చేయటం ఆరంభిస్తుంది. కొన్నిసార్లు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌నూ అడ్డుకుంటుంది. ఆయా సబ్‌స్క్రిప్షన్లకు సంబంధించిన నోటిఫికేషన్లు అందకుండా చేస్తుంది. అంటే తప్పుడు సబ్‌స్క్రిప్షన్ల గురించి మనకు తెలియనీయదన్నమాట. అన్‌సబ్‌స్క్రైబ్‌ చేసుకోనీయదు కూడా. పైగా ఇది డైనమిక్‌ కోడ్‌ లోడింగ్‌ను వాడుకోవటం ద్వారా మొబైల్‌ సెక్యూరిటీ కంట పడకుండా తప్పించుకుంటుంది. ఇదింకా ప్రాథమిక దశలోనే ఉంది. కొత్త కొత్త మార్పులను సంతరించుకుంటోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మైక్రోసాఫ్ట్‌ చెబుతోంది. ముఖ్యంగా విశ్వసనీయం కాని సోర్స్‌ నుంచి ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని, ఎప్పటికప్పుడు పరికరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచిస్తోంది. యాప్స్‌ అవసరాలను పూర్తిగా అర్థం చేసుకున్నాకే ఎస్‌ఎంఎస్‌ పర్మిషన్లు, నోటిఫికేషన్‌ యాక్సెస్‌ ఇవ్వాలని గుర్తుచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని