పీడకలలకు నైట్‌వేర్‌

పీడకలలతో నిద్ర పట్టక సతమతమయ్యేవారి కోసం యాపిల్‌ సంస్థ వినూత్న డిజిటల్‌ చికిత్స వ్యవస్థను ఆరంభించింది. దీని పేరు నైట్‌వేర్‌. దీనికి ఎఫ్‌డీఏ అనుమతీ ఉంది.

Published : 11 Jan 2023 00:41 IST

పీడకలలతో నిద్ర పట్టక సతమతమయ్యేవారి కోసం యాపిల్‌ సంస్థ వినూత్న డిజిటల్‌ చికిత్స వ్యవస్థను ఆరంభించింది. దీని పేరు నైట్‌వేర్‌. దీనికి ఎఫ్‌డీఏ అనుమతీ ఉంది. పీడకలలతో బాధపడే 22 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసువారికిది ఉపయోగపడనుంది. కృత్రిమ మేధ, ఇతర అధునాతన, స్మార్ట్‌ టెక్నాలజీలతో పనిచేసే ఇది వ్యక్తుల ఒత్తిడి సూచీని (నిద్రాభంగం తీరు) విశ్లేషిస్తుంది. యాపిల్‌ వాచ్‌లోని హార్ట్‌ రేట్‌ సెన్సర్‌, యాక్సెలో మీటర్‌, గైరోస్కోప్‌ నుంచి సమాచారాన్ని తీసుకుంటుంది. దీని ఆధారంగా పీడకలలు వస్తున్న విషయాన్ని నిర్ధరిస్తుంది. పీడకలలు వస్తున్నాయని గుర్తించగానే మణికట్టు వద్ద స్వల్ప కంపనాలను వెదజల్లుతుంది. పీడకల నుంచి బయటపడేంతవరకు ఈ కంపనాలు అలా వస్తూనే ఉంటాయి. కానీ నిద్ర నుంచి మేల్కొనేలా చేయవు. ఆయా వ్యక్తుల అవసరాలకు తగినట్టుగా కంపనాలను పుట్టించే పరిజ్ఞాన వేదికల్లో నైట్‌మేర్‌ మొట్టమొదటిది కావటం గమనార్హం. ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత మెరుగ్గా పనిచేయటాన్ని ఇది నేర్చుకుంటుంది కూడా. నిజానికి దీన్ని మిన్నెసోటాలోని మెకాలెస్టర్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్న సమయంలో టైలర్‌ స్క్లజాసెక్‌ అనే ఆయన రూపొందించారు. ఆయన తండ్రి సైన్యంలో పనిచేసేవారు. గాయాల అనంతరం తలెత్తే ఒత్తిడి సమస్య (పీటీఎస్‌డీ) నుంచి ఆయనను బయట పడేయటానికి దీన్ని తయారుచేశారు. కొన్ని సందర్భాల్లో సైనికులకు తోడుగా ఉండటానికి కుక్కలనూ విధుల్లో నియమిస్తుంటారు. ఇవి రక్షణగా ఉండటమే కాదు.. పీడకలలు వస్తున్నప్పుడు వాటిని గుర్తించి, సైనికులను నెమ్మదిగా తడుతుంటాయి కూడా. దీని స్ఫూర్తితోనే నైట్‌వేర్‌ను రూపొందించటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని