పొట్టి లింకు విస్తరణకు

వెబ్‌ పేజీల్లోనో, మెయిల్‌లోనో, సామాజిక మాధ్యమాల్లోనో చాలా లింకులు కనిపిస్తుంటాయి. వీటిని ఓపెన్‌ చేయటానికి ముందు కర్సర్‌ను దాని మీద ఆడిస్తే కింద ఎడమవైపు యూఆర్‌ఎల్‌ దర్శనమిస్తుంది.

Published : 20 Dec 2023 00:01 IST

వెబ్‌ పేజీల్లోనో, మెయిల్‌లోనో, సామాజిక మాధ్యమాల్లోనో చాలా లింకులు కనిపిస్తుంటాయి. వీటిని ఓపెన్‌ చేయటానికి ముందు కర్సర్‌ను దాని మీద ఆడిస్తే కింద ఎడమవైపు యూఆర్‌ఎల్‌ దర్శనమిస్తుంది. లింక్‌ ఓపెన్‌ చేయాల్సిన అవసరముందో లేదో తెలుసుకోవటానికి, సమయం వృథా కాకుండా చూసుకోవటానికిది తోడ్పడుతుంది. హానికర లింకులతో పరికరంలోకి చొచ్చుకొచ్చే మాల్వేర్‌ల బారినపడకుండానూ కాపాడుకోవచ్చు. అయితే ప్రస్తుతం యూఆర్‌ఎల్‌ను పొట్టిగా మార్చి, లింకుల రూపంలో పంపించటం ఎక్కువైంది. వీటి మీదికి కర్సర్‌ తెచ్చినా అదేంటో తెలియదు. నకిలీ మార్కెటింగ్‌ సంస్థలు, హ్యాకింగ్‌ స్కీములు ఇలాంటి పొట్టి లింకులతో బురిడీ కొట్టిస్తుంటాయి. వాటిని క్లిక్‌ చేసేలా పురికొల్పుతాయి. వీటి వలలో పడకుండా ఉండటానికి అన్‌షార్టెన్‌.ఇట్‌ అనే క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ బాగా ఉపయోగపడుతుంది.

 పొడవైన యూఆర్‌ఎల్‌ లింకులను పొట్టిగా మార్చే వెబ్‌సైట్ల మాదిరిగానే పొట్టి లింకులను విస్తరించే వెబ్‌సైట్లు, టూల్స్‌ చాలానే ఉన్నాయి. మరి అన్‌షార్టెన్‌.ఇట్‌ ప్రత్యేకతేంటి? ఇతరత్రా టూల్స్‌ చాలావరకు లింక్‌ను పొట్టిగా చేసే సర్వీసుల ఏపీఐని వాడుకుంటాయి. అంటే లింకులను సంక్షిప్తంగా మార్చిన సర్వీసును సపోర్టు చేయకపోతే అవి వాటిని ఓపెన్‌ చేయలేవు. అన్‌షార్టెన్‌.ఇట్‌ అయితే లింకులను తన ఇంటర్ఫేస్‌ మీదే విస్తరిస్తుంది. అంటే దాదాపు అన్నిరకాల పొట్టి లింకులను ఓపెన్‌ చేస్తుందన్నమాట. దీన్ని వాడుకోవటమూ తేలికే. ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక పొట్టి లింకు మీద రైట్‌ క్లిక్‌ చేసి, మెనూ జాబితాలో అన్‌షార్టెన్‌ దిస్‌ లింక్‌ను ఎంచుకోవాలి. అప్పుడది కొత్త ట్యాబ్‌లో అన్‌షార్టెన్‌ ఇంటర్ఫేస్‌ మీదే ఓపెన్‌ అవుతుంది. అక్కడ ‘డెస్టినేషన్‌ యూఆర్‌ఎల్‌’ విభాగంలో మొత్తం లింకు పేరు కనిపిస్తుంది. పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న వెబ్‌సైట్‌ వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. పైగా ఇది వెబ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌ సాయంతో లింకును స్కాన్‌ చేస్తుంది కూడా. రేటింగ్‌ను బట్టి ఆ వెబ్‌సైట్‌ విశ్వసనీయమైందో, కాదో తెలియజేస్తుంది. పైగా లింకుకు సంబంధించిన ప్రధాన కంటెంట్‌ స్క్రీన్‌షాట్‌నూ చూపిస్తుంది. దాన్ని తెరవాలో, వద్దో తేల్చుకోవటానికిది ఉపయోగపడుతుంది. అది సరైనదేనని, నమ్మొచ్చని భావిస్తే కింద నీలం రంగు బాక్సు మీద నొక్కొచ్చు. ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవటమెందుకని భావిస్తే దీని వెబ్‌ సర్వీస్‌నూ (https://unshorten.it/) వాడుకోవచ్చు. దీని సెర్చ్‌ బార్‌లో పొట్టి లింకును కాపీ చేసి, పేస్ట్‌ చేస్తే చాలు. మొత్తం యూఆర్‌ఎల్‌ పేరు కనిపిస్తుంది. ఒకవేళ అన్‌షార్టెన్‌.ఇట్‌ ఎక్స్‌టెన్షన్‌ పనిచేయకపోతే అన్‌షార్టెన్‌.లింక్‌ అనే మరో క్రోమ్‌ ఎక్స్‌టెన్షనూ ప్రయత్నించొచ్చు. ఇది 300 వరకు లింక్‌ షార్ట్‌నర్‌ సర్వీసులను సపోర్టు చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని