భూ అంతర్భాగం దిశ మారుతుంది!

కాళ్ల కింద భూమి కదులుతుందంటే నమ్ముతారా? మనకంటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు గానీ శాస్త్రవేత్తలకు కాదు. ద్రవరూపంలో ఉండే భూ అంతర్భాగం వేగంగా తిరుగుతుంది మరి. అంతేకాదు, దీని దిశ సైతం మారుతున్నట్టు తాజాగా బయటపడింది....

Published : 22 Jun 2022 00:30 IST

కాళ్ల కింద భూమి కదులుతుందంటే నమ్ముతారా? మనకంటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు గానీ శాస్త్రవేత్తలకు కాదు. ద్రవరూపంలో ఉండే భూ అంతర్భాగం వేగంగా తిరుగుతుంది మరి. అంతేకాదు, దీని దిశ సైతం మారుతున్నట్టు తాజాగా బయటపడింది.

ప్పటికీ మన భూమిలోని మధ్య భాగం గురించి తెలిసింది తక్కువే. సముద్రాల లోతులు తెలుసుకోవాలంటే జలాంతర్గాములను పంపించొచ్చు. గ్రహాల గురించి తెలుసుకోవాలంటే ఉపగ్రహాలను పంపించొచ్చు. కానీ భూమి మధ్యలోకి వెళ్లటం అసాధ్యం, అక్కడికి చేరుకోవాలంటే పైనుంచి సుమారు 5,138 కిలోమీటర్ల లోతు తవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి సుమారు 12 కిలోమీటర్ల లోతు మాత్రమే తవ్వగలిగాం. మరి భూమి లోపలి స్థితిగతులు తెలిసేదెలా?  కొన్ని సాంకేతిక పరిజ్ఞానాలతో వీటిని అంచనా వేయటం సాధ్యమవుతోంది. సాంద్రత కొలమానాలను బట్టి భూమి అంతర్భాగం లోహంతో కూడుకొని ఉండొచ్చని 18వ శతాబ్దం చివరల్లోనే శాస్త్రవేత్తలు నిర్ణయించారు. భూమి మధ్యభాగం గట్టిగా, దాని మీది భాగం ద్రవ స్థితిలో ఉంటుందని డచ్‌ శాస్త్రవేత్త ఇంగే లెహ్‌మాన్‌ 1936లో నిరూపించారు. అనంతరం మధ్య భాగం వేగంగా తిరుగుతుండొచ్చనే భావన పుట్టుకొచ్చింది. దీన్ని బలపరచటానికి శాస్త్రవేత్తలు కొన్ని సాక్ష్యాలనూ చూపించారు. వీరిలో ఒకరు యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్త జాన్‌ ఇ విడలే. ఆయన మరో శాస్త్రవేత్తతో కలిసి తాజాగా మరో కొత్త విషయాన్నీ బయటపెట్టారు. భూమి పగలు, రాత్రి వ్యవధి.. అయస్కాంత క్షేత్రంలో తేడాల కారణంగా భూ అంతర్భాగం తిరిగే వేగం మారటమే కాకుండా ప్రతి ఆరేళ్లకు ఒకసారి తిరిగే దిశ కూడా మారుతోందని పేర్కొన్నారు. అమెరికాలోని మోంటానాలో 1969-1974 మధ్యలో అణు పరీక్షల సమయంలో లాసా అనే భూకంప లేఖిని సమాచారాన్ని క్రోడీకరించి ఈ నిర్ణయానికి వచ్చారు. భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, అణు పరీక్షల వంటి సమయాల్లో పుట్టుకొచ్చే కంపన తరంగాలు వివిధ లోహాల మధ్యలోంచి వెళ్లేటప్పుడు వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తుంటాయి. వీటిని బట్టే భూమి నిర్మాణ రీతుల్ని శాస్త్రవేత్తలు నిర్ణయిస్తుంటారు. విడలే కూడా అణు పరీక్షల సమయంలో నమోదైన సమాచారం ఆధారంగా భూ అంతర్భాగం తిరిగే దిశ మారినట్టు నిర్ధరించారు. అంటే పైన ఉన్నట్టు భూమి లోపలి భాగం స్థిరంగా ఏమీ ఉండదన్నమాట. ప్రతి ఆరేళ్లకోసారి కొద్ది కిలోమీటర్ల వెనక్కి, ముందుకూ జరుగుతూ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని