ఆలూతో స్టార్‌క్రీట్‌!

అంగారకుడి మీద అడుగు పెట్టాలని తహతహలాడుతున్నాం. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాం. అది సరే. మరి నిర్మాణాలకు అవసరమైన కాంక్రీటు ఎలా? అక్కడి దుమ్ము ఉంటుంది కదా.

Updated : 22 Mar 2023 03:19 IST

అంగారకుడి మీద అడుగు పెట్టాలని తహతహలాడుతున్నాం. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాం. అది సరే. మరి నిర్మాణాలకు అవసరమైన కాంక్రీటు ఎలా? అక్కడి దుమ్ము ఉంటుంది కదా. కానీ నీరు లేదే..! దుమ్ము వంటి వాటిని పట్టి ఉంచే పదార్థం (బైండింగ్‌) ఏదీ? వ్యోమగాముల రక్తం, మూత్రాన్ని ఇందుకోసం వాడుకోవచ్చని చాలాకాలంగా అనుకుంటున్నారు. వీటి సంపీడన బలం 40 మెగాపాస్కల్స్‌ (ఎంపీఏ) మాత్రమే. వ్యోమగాములందరూ రక్తాన్ని ఇవ్వటానికి అంగీకరించకపోవచ్చు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకునే యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ పరిశోధకులు కొత్తరకం స్టార్‌క్రీట్‌.. అదే అంతరిక్ష నిర్మాణాలకు ఉపయోగపడే కాంక్రీటును రూపొందించారు. ఇందులో బైండింగ్‌ పదార్థం ఏంటో తెలుసా? బంగాళాదుంప పిండి పదార్థం. దీన్ని అంగారకుడి ధూళితో కలిపి కాంక్రీటు వంటి పదార్థాన్ని సృష్టించారు. ఇది 72 ఎంపీఏ సంపీడన బలాన్ని కలిగుండటం విశేషం. మామూలు కాంక్రీటు సంపీడన బలం 32 ఎంపీఏతో పోలిస్తే ఇది రెండు రెట్ల కన్నా ఎక్కువ. అదే చంద్రుడి ధూళిని బంగాళాదుంప పిండి పదార్థంతో కలిపితే స్టార్‌క్రీట్‌ సంపీడన బలం 92 ఎంపీఏకు పెరగటం గమనార్హం. దీనికి కొంత ఉప్పునూ జోడిస్తే ఇంకాస్త బలం ఎక్కువవుతుంది. వ్యోమగాముల ఆహారం కోసం పిండి పదార్థాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో ఇది ఆచరణీయ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. సుమారు 25 కిలోల ఎండు బంగాళాదుంపల్లో 50 కిలోల స్టార్‌క్రీట్‌ను తయారుచేయటానికి అవసరమైన పిండి పదార్థం లభిస్తుంది. ఇది 213 ఇటుకలతో సమానం! అంతరిక్ష నిర్మాణాలను ఇది సులభం చేయగలదని భావిస్తున్నారు. చవకగానూ అందుబాటులో ఉండటం వల్ల సూక్ష్మంలో మోక్షం చూపించగలదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని