ఇ-సిమ్‌కథ!

సిమ్‌ కార్డుల గురించి తెలిసిందే. మరి ఇ-సిమ్‌ల గురించి? టెలికం సేవా సంస్థలు వీటి గురించి తరచూ ప్రస్తావిస్తున్నాయి. ఫోన్‌ కంపెనీలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్‌ బాగా ముందంజలో ఉంది.

Published : 05 Apr 2023 00:38 IST

సిమ్‌ కార్డుల గురించి తెలిసిందే. మరి ఇ-సిమ్‌ల గురించి? టెలికం సేవా సంస్థలు వీటి గురించి తరచూ ప్రస్తావిస్తున్నాయి. ఫోన్‌ కంపెనీలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్‌ బాగా ముందంజలో ఉంది. మనదగ్గర జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వంటి టెలికం సంస్థలు వీటిని అందిస్తున్నాయి. మున్ముందు ఇవి విశేష ప్రాచుర్యం పొందినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంతకీ ఇ-సిమ్‌ అంటే?

ఎంబెడెడ్‌ సిమ్‌నే ముద్దుగా ఇ-సిమ్‌ అని పిలుచుకుంటున్నారు. ఇది ప్రోగ్రామ్‌ చేసుకోగదగిన చిప్‌. మెయిన్‌ సర్క్యూట్‌ బోర్డుకు నేరుగా అంటుకొని ఉంటుంది. పేరుకు తగ్గట్టుగానే ఇది స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్‌, స్మార్ట్‌వాచ్‌ వంటి పరికరాల్లో నిక్షిప్తమై ఉంటుంది. మామూలు సిమ్‌ కార్డు మాదిరిగా ఫోన్‌లో ఇన్‌సర్ట్‌ చేయాల్సిన అవసరముండదు. బయటకు తీసి, వేరే ఫోన్‌లో వేయటమూ కుదరదు. కన్ఫిగరేషన్‌ ఫైల్‌తో పరికరంలో యాక్టివేట్‌ అవుతుంది. దీని కన్ఫిగరేషన్‌ ఫైల్‌ను ఇ-సిమ్‌ ప్రొఫైల్‌ అని పిలుచుకుంటుంటారు. క్యూఆర్‌ కోడ్‌ రూపంలో అందే దీన్ని స్కాన్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదీ సిమ్‌ కార్డులాగానే పనిచేస్తుంది కానీ ఒక నెట్‌వర్క్‌తోనే ముడిపడి ఉండదు. సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రోగ్రామ్‌ చేసుకోవచ్చు. రీరైట్‌ చేసుకోవచ్చు. అంటే సిమ్‌ను తీసి, కొత్త సిమ్‌ను ఇన్‌సర్ట్‌ చేయాల్సిన పనిలేకుండా నెట్‌వర్క్‌ను మార్చుకోవచ్చు అన్నమాట. ఇప్పటికే చాలామంది రెండు సిమ్‌ల ఫోన్లలో రెండో సిమ్‌గా ఇ-సిమ్‌ను వాడుకుంటున్నారు. అయితే అన్ని ఫోన్లలో ఇసిమ్‌ సదుపాయం లేదు. కొన్ని కంపెనీలే దీన్ని కల్పిస్తున్నాయి. ఉదాహరణకు- యాపిల్‌ గత కొన్నేళ్లుగా ఇ-సిమ్‌ అవకాశాన్ని కల్పిస్తోంది. దీని విషయంలో యాపిల్‌ మార్గదర్శిగానూ నిలుస్తోంది. ఈ కొత్త టెక్నాలజీని ప్రాచుర్యంలోకి తేవటానికి ప్రయత్నిస్తోంది. అమెరికాలో అందుబాటులో ఉండే ఐఫోన్‌ 14లో ఇ-సిమ్‌ సదుపాయం మాత్రమే ఉండటం గమనార్హం. రేపోమాపో అన్ని స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు దీన్నే అనుసరించొచ్చని అనుకుంటున్నారు.

ఇబ్బందులు లేకపోలేదు

మనదేశంలో ఇ-సిమ్‌ల విషయంలో కొన్ని లోపాలు లేకపోలేదు. సిమ్‌కార్డును ఒక ఫోన్‌ నుంచి మరో ఫోన్‌లోకి మార్చుకుంటే వెంటనే పని మొదలెడుతుంది. కానీ మనదగ్గర ఇ-సిమ్‌ను ఒక పరికరం నుంచి మరో పరికరానికి మార్చుకోవటానికి కొన్ని గంటలు పడుతుంది. ఈ సమయంలో వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ల వంటివి అందవు. సిమ్‌ కార్డును వేరే ఫోన్‌లోకి మారిస్తే దాంతో పాటే సేవ్‌ అయిన కాంటాక్టు నంబర్లు కూడా బదిలీ అవుతాయి. అదే ఇ-సిమ్‌లోనైతే క్లౌడ్‌ ద్వారా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తేలికే గానీ దీనికీ కొంత సమయం పడుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైంది- ప్రస్తుతం మనదగ్గర కొన్ని ఫోన్లే ఇ-సిమ్‌ను సపోర్టు చేస్తుండటం. యాపిల్‌, గూగుల్‌, సామ్‌సంగ్‌ వంటి కంపెనీల కొన్ని ఫోన్లే ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి.

లాభాలు అనేకం

ఇ-సిమ్‌ల ప్రత్యేకతలత్లో ఒకటి- ఒక నెట్‌వర్క్‌ నుంచి మరోదానికి తేలికగా మారే వీలుండటం. సిమ్‌ కార్డును తీయటానికి, పెట్టటానికి ఎజెక్టర్‌ టూల్‌ అవసరం లేదు. ఇప్పుడు చాలా దేశాలు ఇ-సిమ్‌ టెక్నాలజీ కలిగి ఉంటున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లినప్పుడు సిమ్‌ కార్డును ఇన్‌సర్ట్‌ చేయకుండానే స్థానిక నెట్‌వర్క్‌కు మారిపోవచ్చు. అక్కడి నెట్‌వర్క్‌లను వాడుకున్నట్టయితే ఖర్చూ తగ్గుతుంది. ఫోన్‌ కంపెనీలు పరికరాన్ని తయారుచేసేటప్పుడు సిమ్‌ కార్డు అమర్చే చోటును బ్యాటరీ కోసం వాడుకోవటానికీ అవకాశం కల్పిస్తుంది. సిమ్‌ కార్డు పళ్లెం చిన్నగానే అనిపించొచ్చు గానీ బ్యాటరీ పవర్‌ విషయానికి వస్తే గొప్పదే అనుకోవచ్చు. కార్డు అమర్చే బటన్‌ ఉండదు కాబట్టి తేమ, ధూళి వంటివి లోనికి వెళ్లటం తగ్గుతుంది. భద్రత పెరగటం మరో ప్రయోజనం. ఫోన్‌ను ఎవరైనా కొట్టేస్తే ఇ-సిమ్‌ను తీసే వీలుండదు. ఫోన్‌ నంబరును సంగ్రహించి, మోసాలకు వాడుకునే వీలుండదు. ఇ-సిమ్‌ను యాక్టివేట్‌ చేసిన ఐఫోన్‌ను ఎవరైనా దొంగిలిస్తే ఫైండ్‌ మై ఫోన్‌ ఫీచర్‌తో తేలికగా గుర్తించొచ్చు. ఫోన్‌ను స్విఛాప్‌ చేసినా అది ఎక్కడుందో తెలుస్తుంది. పరికరాన్ని అన్‌లాక్‌ చేయకుండా ఇ-సిమ్‌ను డీయాక్టివేట్‌ చేయటం కుదరదు మరి. ఇ-సిమ్‌ను తేలికగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఏవైనా లోపాలుంటే సరిచేయొచ్చు. ఇందులో ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలను, ప్రొఫైళ్లను జోడించుకోవచ్చు. అందువల్ల ఒకే ఫోన్‌లో ఆఫీసు నంబరు, వ్యక్తిగత నంబర్లను తేలికగా మార్చుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు