Google I/O 2022: గూగుల్‌ టెక్‌ పండగ వస్తోంది.. కొత్త ప్రొడక్ట్స్‌ను తెస్తోంది!

సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్ కొత్త ఆవిష్కరణలకు సిద్ధమైంది. గూగుల్‌ ఐ/ఓ (Google I/O)2022 పేరుతో నిర్వహించే ఈవెంట్‌లో

Updated : 09 May 2022 20:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కొత్త ఆవిష్కరణలకు సిద్ధమైంది. గూగుల్‌ ఐ/ఓ (Google I/O) 2022 పేరుతో నిర్వహించే ఈవెంట్‌లో తన కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈవెంట్‌కు సంబంధించిన తేదీలను ఇప్పటికే ఖరారు చేసింది. మే 11, 12 తేదీల్లో ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. మరి ఇందులో గూగుల్‌ ఆవిష్కరించే ప్రొడక్ట్స్‌ ఏంటీ? వాటి ప్రత్యేకతలేంటో ఓ కన్నేద్దాం.. 


అప్‌డేటెడ్‌ ఆండ్రాయిడ్‌

గూగుల్‌ ఎప్పటికప్పుడు ఓఎస్‌ను అప్‌డేట్ చేస్తూ యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. గతేడాది ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌ విడుదల చేయగా.. ఇటీవల మరో కొత్త వెర్షన్‌ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను విడుదల చేయనుంది. అయితే, దీన్ని పిక్సెల్‌ ఫోన్‌లో మాత్రమే అందుబాటులోకి తేనుంది. గూగుల్‌ ఐ/ఓ 2022 ఈవెంట్‌లో కొన్ని ప్లాగ్‌షిప్‌ డివైజ్‌ల్లోనూ ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌ను పరిచయం చేయబోతున్నట్లు టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూజర్ల కోసం పలు కొత్త అప్‌డేట్‌లతో ఈ వెర్షన్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. 

కొత్త ఆండ్రాయిడ్‌.. కొత్త స్మార్ట్‌ఫోన్‌

ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌ అప్‌డేట్‌తో గూగుల్‌ మరో కొత్త ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ పిక్సెల్‌ 6ఏ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు అంచనా.  ‘‘పిక్సెల్‌ మోడల్స్‌లో అత్యంత వేగంగా అమ్ముడయ్యే ఫోన్లలో ఒకటిగా ఈ ఫోన్‌ నిలుస్తోంది. దీన్ని విడుదల చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ ఫోన్‌ గురించి మరిన్ని విషయాలు గూగుల్‌ ఐ/ఓ ఈవెంట్‌లో పంచుకుంటాం’’ అని గతంలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. అయితే, సుందర్‌ పిచాయ్‌ నేరుగా గూగుల్‌ పిక్సెల్‌ 6ఏ పేరును ప్రకటించలేదు. పిక్సెల్‌ సిరీస్‌లో 5ఏ సిరీస్‌ తర్వాత వచ్చే మోడల్‌ పిక్సెల్‌ 6ఏగా టెక్‌ నిపుణులు అంచనా వేశారు. ఫోన్‌ వెనకభాగంలో 12.2ఎంపీ ప్రధాన కెమెరా, 12ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా ఇస్తున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 8ఎంపీ కెమెరాను అమర్చినట్లు సమాచారం. 

లేటెస్ట్‌ ఓఎస్‌తో తొలిసారిగా స్మార్ట్‌వాచ్‌..

గూగుల్‌ ఎప్పటినుంచో స్మార్ట్‌ వాచ్‌ను తీసుకురావాలని చూస్తోంది. అయితే, గూగుల్‌ ఐ/ఓ 2022లో పిక్సెల్‌ వాచ్‌ను పరిచయం చేస్తుందని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. వేర్‌ ఓఎస్‌ 3.1(Wear OS 3.1 ) వెర్షన్‌తో కొత్త పిక్సెల్‌ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేయనుందని సమాచారం. అయితే, ఇప్పటివరకు వేర్‌ ఓఎస్‌ 3 వెర్షన్‌ శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 4లో మాత్రమే ఉండేది. గూగుల్‌ తీసుకొచ్చే లేటెస్ట్‌ వెర్షన్‌ స్మార్ట్‌వాచ్‌లో కొత్త ఓఎస్‌ను పరిచయం చేయడంతోపాటు మరిన్ని అప్‌డేట్లను యూజర్లకు అందుబాటులోకి తెస్తుందని అంచనా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని