Pixel 7: భారత్‌లోకి గూగుల్ ఫోన్ల రీఎంట్రీ.. ఎప్పుడంటే?

గూగుల్ కంపెనీ పిక్సెల్‌ సిరీస్‌లో కొత్త ఫోన్‌తో భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పిక్సెల్‌ 7 పేరుతో రెండు వేరియంట్లలో ఫోన్‌ను తీసుకొస్తుంది. 

Published : 22 Sep 2022 23:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్ కంపెనీ పిక్సెల్‌ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను తీసుకురానుంది. ఈ ఫోన్‌తోనే భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. పిక్సెల్‌ 7 పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను అక్టోబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. పిక్సెల్‌ సిరీస్‌లో విడుదలైన గత రెండు మోడల్స్‌ (పిక్సెల్‌5, పిక్సెల్‌ 6)ను గూగుల్ భారత మార్కెట్లోకి తీసుకురాలేదు. దీంతో పిక్సెల్ అమ్మకాలు భారత్‌లో నిలిచిపోయినట్లేనని టెక్ వర్గాలు భావించాయి. తాజాగా పిక్సెల్‌ 7 సిరీస్‌తో గూగుల్ భారత ప్రీమియం ఫోన్‌ మార్కెట్లోకి తిరిగి అమ్మకాలు ప్రారంభించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని గూగుల్ ట్వీట్ చేసింది. పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో మోడల్స్‌ను త్వరలోనే భారత్‌లో విడుదల చేస్తామని ట్వీట్‌లో పేర్కొంది.

పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో పేర్లతో పరిచయం చేయనున్న ఫోన్లలో టెన్సర్ జీ2 సెకండ్ జనరేషన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇవి ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో పనిచేస్తాయి. పిక్సెల్‌ 7 మోడల్‌లో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.3-అంగుళాల డిస్‌ప్లే, పిక్సెల్‌ 7 ప్రోలో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7-అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. వీటిలో వెనుకవైపు కెమెరా మాడ్యూల్‌ను పిక్సెల్‌ 6ఏలో మాదిరి గ్లాస్‌ మెటీరియల్‌తో కాకుండా అల్యూమినియం మెటీరియల్‌తో డిజైన్‌ చేశారు. పిక్సెల్‌ 7లో వెనుకవైపు 50 ఎంపీ, 12 ఎంపీ కెమెరాలు, పిక్సెల్‌ 7 ప్రోలో  50ఎంపీ, 12ఎంపీ కెమెరాలతోపాటు అదనంగా 48 ఎంపీ టెలీఫొటో కెమెరా అమర్చారు. 

ఈ ఫోన్‌తోపాటు పిక్సెల్‌ వాచ్‌ను కూడా గూగుల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. గుండ్రటి డయల్‌, ఆకట్టుకునే డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఈ వాచ్‌ గూగుల్ వేర్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌, గూగుల్ మ్యాప్స్‌, గూగుల్ వాలెట్ వంటి యాప్స్‌తోపాటు ఎన్‌ఎఫ్‌సీ పేమెంట్స్‌ను సపోర్ట్ చేస్తుంది. హార్ట్‌రేట్‌, స్లీప్‌ ట్రాకింగ్‌ వంటి ఫీచర్లతోపాటు మరెన్నో హెల్త్‌, ఫిట్‌నెస్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర, ఇతర ఫీచర్ల గురించి పూర్తి వివరాల కోసం అక్టోబరు 6 వరకు వేచి చూడాల్సిందే. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని