Google Chrome: క్రోమ్‌ యూజర్లకు జీరో-డే ముప్పు.. బ్రౌజర్‌ను అప్‌డేట్ చేశారా?

క్రోమ్‌ యూజర్ల కోసం గూగుల్‌ కంపెనీ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. జీరో-డే సాఫ్ట్‌వేర్‌ ద్వారా జరిగే సైబర్‌ దాడుల నుంచి ఈ అప్‌డేట్‌ ద్వారా యూజర్లకు రక్షణ ఉంటుందని గూగుల్ తెలిపింది.  

Updated : 06 Aug 2022 17:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సైబర్‌ దాడులు, మాల్‌వేర్‌ల నుంచి యూజర్లకు రక్షణ కల్పించేందుకు టెక్‌ కంపెనీలు ఆయా సాఫ్ట్‌వేర్‌లకు సంబంధిచిన కొత్త అప్‌డేట్‌లను విడుదల చేస్తుంటాయి. కొద్దిరోజుల క్రితం విండోస్‌, ఆండ్రాయిడ్, లైనెక్స్‌, మ్యాక్‌ ఓఎస్‌లలో క్రోమ్‌ బ్రౌజర్‌ ఉపయోగించే యూజర్ల డేటా లక్ష్యంగా జీరో-డే సాఫ్ట్‌వేర్‌తో వైరస్‌ను పంపుతున్నట్లు అవాస్ట్‌ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీకి చెందిన థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ ముందుగా గుర్తించింది. ఈ విషయాన్ని గూగుల్ దృష్టికి తీసుకెళ్లడంతో, వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో యూజర్లు తమ  క్రోమ్‌ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. ఇప్పటికే జీరో-డే ద్వారా జరిగే సైబర్‌ దాడులకు సంబంధించి గూగుల్ కంపెనీ ఎప్పటికప్పుడు క్రోమ్‌ అప్‌డేట్‌ వెర్షన్‌లను విడుదల చేస్తున్నప్పటికీ, హ్యాకర్లు కొత్త పంథాలో యూజర్‌ డేటాపై దాడి చేస్తున్నారు. 

క్రోమ్‌ బ్రౌజర్‌లో మొత్తం నాలుగు మాల్‌వేర్‌లను గుర్తించినట్లు గూగుల్ తెలిపింది. వాటిలో CVE-2022-2294, CVE-2022-2295, CVE-2022-2296 అనే మూడు మాల్‌వేర్‌ ప్రమాదకరమైనవిగా గూగుల్ పేర్కొంది. క్రోమ్‌ అప్‌డేట్ కోసం యూజర్లు బ్రౌజర్‌ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లో అబౌట్‌ క్రోమ్‌పై క్లిక్ చేస్తే కొత్త వెర్షన్‌ అప్‌డేట్‌ను చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేయొచ్చు. కొన్ని కంప్యూటర్లలో మాత్రం క్రోమ్‌ బ్రౌజర్‌ ఆటోమేటిగ్గా కొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ అవుతుందని తెలిపింది. దీంతోపాటు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఆండ్రాయిడ్ 103.0.5060.71 వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. కొద్దిరోజులు తర్వాత గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు ఈ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని