Published : 16 May 2022 17:51 IST

Google PlayStore: యాప్‌ డెవలపర్స్‌కు గూగుల్ షాక్‌.. ప్లేస్టోర్‌ నుంచి 9 లక్షల యాప్‌ల తొలగింపు!

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌లో ఏ పని చేయాలన్నా యాప్‌ ఉండాల్సిందే. ఫోన్‌ కాలింగ్‌ నుంచి ఈ-కామర్స్‌లో ఆర్డర్స్‌ వరకు అన్ని రకాల పనులు యాప్‌తోనే జరుగుతాయి. యూజర్ల సౌకర్యం కోసమంటూ గూగుల్ ప్లేస్టోర్‌లో ఎన్నో రకాల యాప్స్‌ పుట్టుకొస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని నకిలీ యాప్స్‌ కూడా ఉన్నాయి. యూజర్స్‌ డేటా కోసం సైబర్‌ నేరగాళ్లు వీటిని ఉపయోగిస్తున్నారు. గూగుల్ అలాంటి వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తుంటుంది. తాజాగా ఇలాంటి యాప్స్‌ గురించి గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లేస్టోర్‌లోని సుమారు తొమ్మిది లక్షల యాప్‌లపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.

గత రెండేళ్లుగా ఈ యాప్‌లు అప్‌డేట్‌ కాకపోవడం, గూగుల్ నిబంధనలను పాటించకపోవడంతో వీటి ప్రక్షాళనకు పూనుకుంది.  దీంతో ఈ యాప్‌లు ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉండవని సమాచారం. అయితే గూగుల్ వీటిని పూర్తిగా తొలగిస్తుందా లేదా తాత్కాలికంగా వీటిపై నిషేధం విధిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి 150 యాప్‌లను తొలగించింది. ఈ యాప్‌లు అల్టిమాఎస్సెమ్మెస్‌ అనే ప్రచారం నిర్వహిస్తూ ఆండ్రాయిడ్‌ ఫోన్ల నుంచి యూజర్ల డేటాను సేకరిస్తున్నాయని గూగుల్ తెలిపింది.

అలానే 9 లక్షల యాప్‌లలో కొన్నింటిని యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వారి లొకేషన్‌, ఐఎమ్‌ఈఐ నంబర్‌, ఫోన్‌ నంబర్‌, ఉపయోగించే భాష వంటి వివరాలు సేకరించి వాటిని ప్రకటనల కోసం ఉపయోగిస్తున్నాయని వెల్లడించింది. వీటిలో సైబర్‌ నేరగాళ్లు ముందుగా యూజర్‌ ఫోన్‌ నంబర్‌ ఎంటర్  చేయమని అడిగి, తర్వాత ప్రీమియం ఎస్సెమ్మెస్‌ సర్వీసులకు సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే నగదు బహుమతులుంటాయని ఆశ చూపి యూజర్లను మోసగిస్తున్నట్లు గుర్తించామని అవాస్ట్ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. అందుకే యూజర్లు యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు వాటికి ప్లేస్టోర్‌ అథెంటికేషన్‌ ఉందా? లేదా? అనేది సరిచూసుకోవడంతోపాటు డెవలపర్స్‌ ఎవరు? ఆయా సంస్థలకు యూజర్‌ రేటింగ్ ఎంత ఉంది? యూజర్ల కామెంట్స్‌ వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోమని గూగుల్ సూచిస్తోంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts