Samsung: శాంసంగ్ కొత్త ఫోన్.. ఎటు తిప్పినా డిస్‌ప్లేనే!

శాంసంగ్ కంపెనీ కొత్త మోడల్‌ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. రెండువైపులా డిస్‌ప్లే తీసుకొస్తున్న ఈ ఫోన్ ప్రత్యేకలేంటో చూద్దాం. 

Published : 09 May 2022 21:59 IST

(Photo Credit: LetsGo Digital)

ఇంటర్నెట్‌డెస్క్‌: సాంకేతిక ప్రపంచంలో ఆవిష్కరణలకు కొదవేలేదు. అయితే ఒకరి ఆవిష్కరణను మరొకరు కాపీ చేయకుండా ఉండేందుకు సదరు వ్యక్తులు లేదా కంపెనీలు వాటికి పేటెంట్ హక్కులను పొందుతాయి. తాజాగా శాంసంగ్‌ విఐపీఓ (వరల్డ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌)లో కొత్త మోడల్‌ ఫోన్‌కు పేటెంట్‌ హక్కులను పొందినట్లు సమాచారం. ఈ మోడల్‌లో ఫోన్‌కు రెండు వైపులా డిస్‌ప్లే ఉండటం ప్రత్యేకత. దీంతో యూజర్స్‌ తమకు నచ్చిన వైపు డిస్‌ప్లేను ఉపయోగించుకోవచ్చు. అలానే ఈ ఫోన్‌లో వెనుక, ముందు కెమెరాలను అమర్చారు. అయితే రెండు వైపులా డిస్‌ప్లే ఉండటంతో వెనుక కెమెరాను కూడా సెల్ఫీ కెమెరాగా ఉపయోగించుకునే సదుపాయం ఉంది.

శాంసంగ్‌ ఈ ఫోన్‌ను గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో పరిచయం చేయనుందట. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌30 అల్ట్రా 6జీ (Samsung Galaxy S30 Ultra 6G) పేరుతో ఈ ఏడాది చివర్లో అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే షోవోమి కంపెనీ రెండు వైపులా డిస్‌ప్లే మిక్స్‌ ఆల్ఫా (MIX Alpha) పేరుతో కొత్త మోడల్‌ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో పాప్‌-అప్‌ ఫీచర్‌తో ట్రిపుల్ కెమెరా, డ్యూయల్‌-ఎల్‌ఈడీ ఫ్లాష్‌ లైట్‌ ఇస్తున్నట్లు సమాచారం. మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేస్తారనేది తెలియాల్సి ఉంది. 

ఇవేకాకుండా శాంసంగ్ రోలింగ్ డిస్‌ప్లే, రెండు మడతలతో ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. వీటిలో రెండు మడతల ఫోన్ స్క్రీన్ తెరిచినప్పుడు ట్యాబ్‌ స్క్రీన్‌లా మారిపోతుంది. ఇక రోలింగ్ డిస్‌ప్లే ఫోన్‌ను చిన్న కంప్యూటర్‌లా ఉపయోగించుకోవచ్చు. ఈ రెండింటిలో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే వినియోగించినట్లు సమాచారం. రోలింగ్ డిస్‌ప్లే మోడల్‌ స్క్రీన్‌ను సిలిండర్ ఆకృతిలో పోలి ఉండే స్టిక్‌లో చుట్టేయొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని