WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌.. కానీ డబ్బులు కడితేనే!

Whatsapp multi device support: వాట్సాప్‌ మల్టీ డివైజ్‌ సపోర్టును 10 డివైజ్‌లకు పొడిగిస్తారా...

Published : 21 Apr 2022 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ (WhatsApp)లో మల్టీ డివైజ్‌ సపోర్టు (Multi device support) వచ్చిందనే విషయం మీకు తెలిసే ఉంటుంది. మొబైల్‌కి నెట్‌వర్క్‌ కనెక్షన్‌ లేకపోయినా... సిస్టమ్‌/ట్యాబ్‌లో అదే మొబైల్‌ నెంబరుతో వాట్సాప్‌ వాడగలగటం ఆ ఫీచర్‌ ఉద్దేశం. ప్రస్తుతం ఈ సదుపాయం నాలుగు డివైజ్‌ల లిమిట్‌తో అందుబాటులో ఉంది. అయితే, ఈ పరిమితిని 10 డివైజ్‌లకు పెంచాలని వాట్సాప్‌ భావిస్తోందట. కానీ, దాని కోసం చిన్న మెలిక పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త వాట్సాప్‌ ఫీచర్‌ వాడాలంటే డబ్బులు (సబ్‌స్క్రిప్షన్‌) చెల్లించాలట. 

ప్రీమియర్‌, ప్రో సేవలను అందించడానికి కొన్ని టెక్‌ సంస్థలు సబ్‌స్క్రిప్షన్‌ (చందా)ను వసూలు చేస్తుంటాయి. అంటే నిర్ణీత మొత్తంలో డబ్బును తీసుకొని ఆ అదనపు సౌకర్యాలను అందించడం. ఇప్పుడు వాట్సాప్‌ కూడా అదే పని చేయనుందని టాక్‌. తొలుతగా ఈ పెయిడ్‌ సర్వీసును వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతాదారులకు అందించాలని చూస్తోందట. అంటే... వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ వాడుతున్నవాళ్లు త్వరలో డబ్బులు చెల్లించి 10 డివైజ్‌ల సౌకర్యాన్ని వాడుకోవచ్చన్నమాట.

ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న సౌకర్యాన్ని త్వరలో ప్రయోగాత్మకంగా కొంతమంది వాట్సాప్‌ బిజినెస్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తారట. అయితే, ఎంత మొత్తం వసూలు చేస్తారు,  నెలవారీ చందానా లేక వార్షిక చందానా అనే వివరాలు అందుబాటులో లేవు. ఒకే నెంబరుతో వాట్సాప్‌ను ఎక్కువమంది వాడి, బిజినెస్‌లో కస్టమర్‌ రిలేషన్‌ను పెంచుకుందాం అనుకునేవారికి ఈ ఆప్షన్‌ ఉపయుక్తంగా ఉంటుంది. మరి ఈ ఫీచర్‌ కేవలం వాట్సాప్‌ బిజినెస్‌కి మాత్రమే పరిమితం చేస్తారా? లేక సాధారణ వాట్సాప్‌కు కూడా తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని