WhatsApp: వాట్సాప్‌ చాట్‌ బ్యాకప్‌.. గూగుల్ డ్రైవ్‌ నుంచే డేటా ఎక్స్‌పోర్ట్‌!

వాట్సాప్‌లో వచ్చే మీడియాఫైల్స్‌ను భవిష్యత్తు అవసరాల కోసం బ్యాకప్‌ చేస్తుంటాం. అలా బ్యాకప్‌ చేసుకున్న ఫైల్స్‌ నేరుగా గూగుల్ డ్రైవ్‌లో స్టోర్‌ అవుతాయి. ఇప్పుడు ఈ వాట్సాప్‌ బ్యాకప్‌కు అదనంగా మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. దీని సాయంతో యూజర్స్ తమ బ్యాకప్‌ డేటాను గూగుల్ డ్రైవ్‌ నుంచి నేరుగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు.

Published : 14 Jun 2022 01:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌లో వచ్చే మీడియాఫైల్స్‌ను భవిష్యత్తు అవసరాల కోసం బ్యాకప్‌ చేస్తుంటాం. అలా బ్యాకప్‌ చేసుకున్న ఫైల్స్‌ నేరుగా గూగుల్ డ్రైవ్‌లో స్టోర్‌ అవుతాయి. ఒకవేళ యూజర్‌ వాట్సాప్‌ను పాత డివైజ్‌ నుంచి కొత్త డివైజ్‌లో మార్చినప్పుడు వాటిని సులువుగా రీస్టోర్‌ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాట్సాప్‌ బ్యాకప్‌కు అదనంగా మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. దీని సాయంతో యూజర్స్ తమ బ్యాకప్‌ డేటాను గూగుల్ డ్రైవ్‌ నుంచి నేరుగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం వాట్సాప్ సెట్టింగ్స్‌లో చాట్ (Chat) సెక్షన్‌లో చాట్ బ్యాకప్‌ (Chat Backup)లోకి వెళితే బ్యాకప్‌ టు గూగుల్ డ్రైవ్‌ (Baclup To Google Drive) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఎన్ని రోజులకొకసారి బ్యాకప్‌ చేయాలనేది ఎంపిక చేసుకుంటే వాట్సాప్‌లోని మీడియాఫైల్స్‌ గూగుల్ డ్రైవ్‌లో స్టోర్‌ అవుతాయి. త్వరలో వీటితోపాటు ఎక్స్‌పోర్ట్ బ్యాకప్‌ (Export Backup) అనే ఫీచర్‌ కూడా రానుంది. బ్యాకప్‌ అయిన డేటాను యూజర్లు ఎక్స్‌పోర్ట్ బ్యాకప్‌పై క్లిక్ చేసి తమకు నచ్చిన డివైజ్‌ లేదా క్లౌడ్‌లోకి మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉంది. త్వరలోనే దీన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోందట. 

దీనితో పాటు బిజినెస్‌ యూజర్లకు కూడా మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. మొబైల్‌లో డు నాట్ డిస్ట్రబ్‌ మోడ్‌ (Do Not Distrub Mode) ఎనేబుల్ చేసి ఉన్నప్పుడు వాట్సాప్‌ కాల్‌ వచ్చినా యూజర్‌కు తెలియదు. అలానే మిస్డ్‌కాల్‌ నోటిఫికేషన్‌ బార్‌లో కూడా చూపించదు. యూజర్‌ వాట్సాప్ కాల్‌ లాగ్‌లోకి వెళితేనే మిస్డ్‌కాల్ ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఎందుకు మిస్డ్‌కాల్ వచ్చిందనేది మాత్రం తెలియదు. వాట్సాప్‌ తీసుకురాబోయే ఫీచర్‌తో కాల్‌లాగ్‌లో చిన్న లేబుల్ మీద డు నాట్‌ డిస్ట్రబ్‌ మోడ్‌ ఎనేబుల్ చేయడం వల్ల మిస్డ్‌కాల్ వచ్చిందని యూజర్‌కు కనిపిస్తుందట. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఐఓఎస్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. ఇవేకాకుండా వాట్సాప్‌ గ్రూప్‌లో 256 మంది సభ్యుల పరిమితిని 512కు పెంచనుంది. యూజర్ల భద్రత కోసం డబుల్ వెరిఫికేషన్‌ ఫీచర్‌ను కూడా వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకురానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని