మోటో జీ9 ప్లస్‌: కొత్త ఫీచర్లు ఏంటంటే..?

కొద్ది రోజుల క్రితం మోటోరోలా కంపెనీ బడ్జెట్ ధరలో జీ9 పేరుతో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. తాజాగా జీ9కి కొనసాగింపుగా జీ9 ప్లస్‌ పేరుతో మరో మోడల్‌ని అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది....

Updated : 05 Aug 2022 16:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొద్ది రోజుల క్రితం మోటోరోలా కంపెనీ బడ్జెట్ ధరలో జీ9 పేరుతో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. తాజాగా జీ9కి కొనసాగింపుగా జీ9 ప్లస్‌ పేరుతో మరో మోడల్‌ని అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ ఛార్జింగ్, ఇంటర్న్‌ల్‌ మెమరీ, డిస్‌ప్లేలలో కీలక మార్పులు చేశారు.  మోటోరోలా జీ9 ప్లస్‌ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. హెచ్‌డీఆర్‌ 10 సపోర్ట్‌తో 6.8 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ మాక్స్‌ విజన్ హోల్‌ పంచ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 730జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

ఈ ఫోన్‌లో ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 2మెగాపిక్సెల్ మాక్రో, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరాలు ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. జీ9లోలానే ఇందులో కూడా 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 30వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. జీ9 మోడల్‌ కేవలం 20వాట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. జీ9 ప్లస్‌ 4జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్‌ మెమరీ వేరియంట్‌లో లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ మోడల్ అమ్మకాలు బ్రెజిల్‌లో మాత్రమే ప్రారంభమయ్యాయి. అక్కడి మార్కెట్లో ఈ వేరియంట్ ధర 2,499 బ్రెజిలియన్ రియాల్స్‌. అంటే మన కరెన్సీలో సుమారు రూ.35,000. రోజ్‌ గోల్డ్‌, ఇండిగో బ్లూ రంగుల్లో లభిస్తుంది. భారత్‌ మార్కెట్లో విడుదల తేదీ, ధరపై కంపెనీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని