స్థలం ఇవ్వలేదు.. అద్దె కట్టలేదు!

వందల కుటుంబాల త్యాగం ఫలితంగా మల్లన్న సాగర్‌ జలాశయం రూపుదిద్దుకుంది. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 10 టీఎంసీలు నింపారు. జలాశయం నిర్మాణానికి భూములు, ఇళ్లు ఇచ్చిన త్యాగధనులకు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందించలేదు.

Updated : 01 Dec 2021 05:56 IST

అవస్థల్లో మల్లన్నసాగర్‌ నిర్వాసితులు
పరిహారమూ పూర్తిగా అందలేదని ఆవేదన
ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట

ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామస్థులకు కేటాయించబోయే స్థలంలో అసంపూర్తిగా ఉన్న సిమెంటు రోడ్డు పనులు

వందల కుటుంబాల త్యాగం ఫలితంగా మల్లన్న సాగర్‌ జలాశయం రూపుదిద్దుకుంది. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 10 టీఎంసీలు నింపారు. జలాశయం నిర్మాణానికి భూములు, ఇళ్లు ఇచ్చిన త్యాగధనులకు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందించలేదు. సర్వం కోల్పోయినా తమ గోడు వినే నాథులే కరవయ్యారని బాధపడుతూ వారంతా కాలం వెళ్లదీస్తున్నారు.


జలాశయం నిర్మాణంతో ఎనిమిది పంచాయతీల పరిధిలో 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మొత్తం 6,581 కుటుంబాలు ఉండగా, అందులో 2,500 కుటుంబాలకు గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియా పరిధి సంగాపూర్‌లో 600 ఎకరాల్లో రెండుపడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కొండపాక మండలం ఎర్రవల్లి, సింగాటంలో మరికొందరికి స్థలాలు ఇచ్చారు. కట్టిన ఇంటికి బదులు.. స్థలం కావాలని కోరుకున్న వారికి గజ్వేల్‌ పరిధిలో 250 గజాల చొప్పున కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వాటిలో ఇల్లు కట్టుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.5.04 లక్షలు అందజేశారు. అంతవరకూ బాగానే ఉన్నా ఎవరి స్థలం ఎక్కడుందో ఇప్పటివరకూ చూపించలేదని బాధితులు వాపోతున్నారు.


ఎన్నాళ్లిలా

నిర్వాసితులు తాత్కాలికంగా ఉంటున్న రెండు పడక గదుల ఇళ్లు

ఇళ్లు లేని వారంతా తాత్కాలికంగా గజ్వేల్‌ పట్టణంలో పేదల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లలో నివాసం ఉండేలా అధికారులు ఏర్పాట్లుచేశారు. అవీ నిండిపోవడంతో, మిగిలిన వారిని అద్దె ఇళ్లలో ఉండేలా ఒప్పించారు. అద్దె కింద ఆరు నెలలకు రూ.30 వేల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ‘‘మమ్మల్ని గ్రామంనుంచి తరలించే సమయంలో పదిహేను రోజుల్లో స్థలాలు కేటాయిస్తామని అధికారులు చెప్పారు. ఆరు నెలలు గడిచినా కేటాయింపు మాటెత్తడం లేదు. మొత్తం 920 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. 450 కుటుంబాలకు అద్దె సొమ్ము కూడా ఇవ్వలేదు. వ్యవసాయాధారంగా జీవించిన మేమంతా ఉపాధి లేక ఇళ్లకే పరిమితమయ్యాం. అద్దె సొమ్ము ఎలా చెల్లించగలం’ అని బాధితులంతా ఆవేదన వ్యక్తంచేశారు. పరిహారం ఆలస్యం అవుతోందనే వ్యధతో నాలుగు నెలల క్రితం రైతు బానోతు హన్మంతు చనిపోయాడని తెలిపారు.


కుటుంబ పోషణ భారమైంది
- ఎల్దండి నర్సింహారెడ్డి, ఏటిగడ్డ కిష్టాపూర్‌

ముంపులో 15 ఎకరాల సాగు భూమి కోల్పోయా. ఆరు నెలల నుంచి గజ్వేల్‌లో అద్దెకు ఉంటున్నా. ఇంటి స్థలం ఇవ్వలేదు. అద్దె సొమ్ము చెల్లించలేదు. నెలకు రూ.6 వేల చొప్పున కిరాయి చెల్లిస్తున్నా. ఇక్కడ పని దొరకక కుటుంబ పోషణ భారమవుతోంది.


పనిలేక ఇబ్బంది
-బండి యాదగిరి, ఏటిగడ్డ కిష్టాపూర్‌

తాత్కాలికంగా గజ్వేల్‌ పట్టణ పరిధిలో రెండు పడక గదుల ఇంటిలో ఉంటున్నా. ఊరు ఉన్నపుడు మూడెకరాల్లో వ్యవసాయం చేసేవాడిని. ప్రస్తుతం ఏ పనీ లేదు. కనీసం స్థలమైనా త్వరగా కేటాయిస్తే ఇల్లు కట్టుకుని, ఏదో ఒక పని వెతుక్కుంటాం.


ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం
- అనంతరెడ్డి, ఆర్డీవో, సిద్దిపేట

మల్లన్న సాగర్‌ జలాశయం నిర్వాసితులకు గ్రామాలవారీగా స్థలాలు కేటాయించాలని నిర్ణయించాం. వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం. త్వరలో స్థల కేటాయింపులు పూర్తిచేస్తాం. నిర్వాసితులెవరూ ఆందోళన చెందొద్దు. త్వరలో అద్దె సొమ్ము కూడా చెల్లిస్తాం.



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని