Statue of Equality: శోభాయమానం... సమారోహం

భక్తుల కోలాటాలు.. కళాకారుల వాద్య విన్యాసాలు.. జీయర్‌ స్వాముల మంగళ వచనాల నడుమ భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకలు బుధవారం ఘనంగా

Updated : 03 Feb 2022 05:27 IST

రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు ఘనంగా అంకురార్పణ

ఏడుగురు జీయర్‌ స్వాముల పర్యవేక్షణలో క్రతువు

నేటి నుంచి సహస్ర కుండ శ్రీలక్ష్మీనారాయణ యజ్ఞం

ఈనాడు, హైదరాబాద్‌: భక్తుల కోలాటాలు.. కళాకారుల వాద్య విన్యాసాలు.. జీయర్‌ స్వాముల మంగళ వచనాల నడుమ భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జై శ్రీమన్నారాయణ నినాదాలు..  అష్టాక్షరీ మంత్రోచ్చారణలతో ముచ్చింతల్‌ క్షేత్రం ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడింది. రామానుజులు అవతరించి వెయ్యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తలపెట్టిన ఈ వేడుకలకు హైదరాబాద్‌ శివారు సరికొత్త రూపు సంతరించుకుంది. 12 రోజులపాటు వైభవోపేతంగా జరిగే ఉత్సవాలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో బుధవారం అంకురార్పణ చేశారు. అహోబిల జీయర్‌స్వామి, దేవనాథ జీయర్‌స్వామి, శ్రీనివాస వ్రతధర జీయర్‌స్వామి, అష్టాక్షరీ సంపత్‌కుమార జీయర్‌స్వామి, శ్రీరామచంద్ర జీయర్‌స్వామి, ముక్తినాథ జీయర్‌స్వామి కూడా ఈ క్రతువులో పాలుపంచుకుంటున్నారు.

తొలిరోజు ఉదయం శోభాయాత్రతో నాంది పలికి.. సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో సాయంత్రం 6.30 గంటలకు అంకురార్పణ మొదలైంది. పుట్టమన్ను తెచ్చి నవధాన్యాలతో కలిపి ఘటిక, పాలికలో ఉంచి క్రతువు చేపట్టారు. యజ్ఞాల్లో పాల్గొనే రుత్వికులకు చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో కంకణధారణ, దీక్షా వస్త్రాల సమర్పణ చేశారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకతోపాటు ఉత్తరాది రాష్ట్రాలు, విదేశాల నుంచి 5 వేల మంది రుత్వికులు విచ్చేశారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే యజ్ఞాలకు యాగశాలలను తోరణాలతో అలంకరించి సిద్ధం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మైహోం గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామేశ్వరరావు దంపతులు, సమతామూర్తి ప్రాజెక్టు అధ్యక్షుడు వనజా భాస్కరరావు, జీవా ప్రాజెక్టు అధ్యక్షుడు చలిమెడ లక్ష్మణరావు, జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు ఛైర్మన్‌     గోకరాజు గంగరాజు హాజరయ్యారు.

కనుల పండువగా శోభాయాత్ర

తొలుత ఉదయం అశ్వవాహనారూఢుడైన సీతారామచంద్రస్వామిని ఊరేగించారు. బాలస్వాములు ముందు నడుస్తుండగా.. శంఖనాదాలు మార్మోగగా.. జీయర్‌స్వాముల మార్గదర్శనంలో విశేషంగా అలంకరించిన వాహనంలో పెరుమాళ్‌ శోభాయాత్ర కనులపండువగా సాగింది. వేలాది మంది రుత్వికులు, వేదపండితులు, వాలంటీర్లు వెంట నడవగా.. మహిళల కోలాటాలు, జయజయధ్వానాలతో ఆశ్రమం నుంచి యాగశాల వరకు గంటసేపు ఊరేగింపు కొనసాగింది. రాములవారిని యాగశాలకు తీసుకువచ్చాక పూజలు చేశారు. అనంతరం హనుమంతుడిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. మధ్యాహ్నం శాస్త్రోక్తంగా వాస్తుహోమాలను ప్రారంభించారు.

సాధారణ భక్తులకూ అవకాశం

ఉత్సవాల్లో సాధారణ భక్తులను అనుమతిస్తామని నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11 రోజులపాటు కొనసాగనున్న యాగాలు, ప్రవచనాలకు వారు హాజరు కావచ్చన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని ఈ నెల 5న ప్రధాని ఆవిష్కరించిన తర్వాతే వారిని అనుమతిస్తామన్నారు. ఈ నెల 13 తర్వాత 108 దివ్య క్షేత్రాలు, స్వర్ణమూర్తిని దర్శనం చేసుకునే సౌకర్యం అందరికీ కల్పిస్తామని పేర్కొన్నారు. వేడుకల్లో తొలి రోజు 50 వేల మంది భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు.


వెర్రితలలు వేస్తున్న వాస్తు విధానం: చినజీయర్‌స్వామి

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, శంషాబాద్‌: ప్రస్తుత సమయంలో వాస్తు అనేది వెర్రితలలు వేస్తోందని, దీనివల్ల చాలా మందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి అన్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహం సందర్భంగా వాస్తుపూజ, హోమాలు, అంకురార్పణల విశిష్టతను ఆయన భక్తులకు వివరించారు. ‘అసురుల్లో మంచివారు, చెడ్డవారు ఉంటారు. పురాణాల ప్రకారం భృగుమహర్షి స్వేదం నుంచి పుట్టిన అసురుడు. మనుషులు, దేవతలను అల్లకల్లోలం చేసేవాడు. ఆయనను అణచివేసేందుకు దేవతలు ప్రయత్నించారు. ఆ సమయంలో అసురుడు బ్రహ్మను ప్రార్థించగా.. ఇల్లు కట్టుకునేవారు.. ఏదైనా అభివృద్ధి చేసేవారిపై నీ దృష్టి ప్రభావం ఉంటుంది. నిన్ను శాంతింపజేస్తే బాధ తగ్గి సుఖం కలుగుతుందని వరం ఇచ్చార’ని వివరించారు. దాంతో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసేటప్పుడు ఇబ్బంది కలగకుండా వాస్తు పురుషుడికి శాంతి పూజలు, హోమం చేయడం ఆచారంగా వచ్చిందన్నారు. ఈ సందర్భంగా అహోబిల జీయర్‌ స్వామి తదితరులు యాగాలు, పుణ్యక్షేత్రాలు తదితర విశిష్టతలను వివరించారు.


నేటి కార్యక్రమాలు ఇలా..

యాగశాలలో ఈ నెల 14 వరకు హోమాలు ఉంటాయి. ముందుగా మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన చేస్తారు. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉద్భవించే అగ్నిహోత్రంతో 1,035 కుండాలను వెలిగించి హోమాలు ప్రారంభిస్తారు. ఇష్టిశాలల వద్ద దుష్ట నివారణకు శ్రీసుదర్శనేష్టి, సర్వాభీష్టసిద్ధికి శ్రీవాసుదేవేష్టి చేస్తారు. అనంతరం శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామపూజ, ప్రవచనాలు ఉంటాయి. 4న అష్టాక్షరీ మహామంత్ర సామూహిక పారాయణం చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని